ఆరాంఘర్ చౌరస్తాలో కారులోంచి మంటలు

ఆరాంఘర్ చౌరస్తాలో కారులోంచి మంటలు

శంషాబాద్,వెలుగు :  ఆగిన కారులోంచి మంటలు చెలరేగిన ఘటన మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆరాంఘర్ చౌరస్తా బస్టాప్ సమీపంలో బుధవారం రోడ్డు పక్కన జైలో కారు( ఏపీ21 సీసీ 5956)లో అకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఎవరో కావాలనే కారుకు నిప్పు అంటించారని స్థానికులు పేర్కొంటున్నారు. మైలర్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిలింనగర్ లోని ఓ హోటల్ లో..

జూబ్లీహిల్స్ :  ఓ హోటల్లో మంటలు చెలరేగిన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది.  ఫిలింనగర్ తెలుగు ఫిలిం చాంబర్ ఆవరణలో  స్వరుచి హోటల్ ను అన్నదమ్ములు జలంధర్,  శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో హోటల్ కిచెన్ లోని చిమ్ని నుంచి మంటలు లేచి బయటకు వ్యాపించాయి.  దీంతో బిల్డింగ్ చుట్టూ పలు షాపులు, ఆఫీసులు ఉండగా స్థానికుల్లో భయాందోళన నెలకొంది.  ఫిలింనగర్ ఫైర్ సర్వీస్ అధికారి చంద్రశేఖర్ బాబు, డీఆర్ఎఫ్ టీమ్  వెంటనే వెళ్లి మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు హోటల్ నిర్వాహకుడు శ్రీనివాస్ తెలిపారు.

ఘట్ కేసర్ పీఎస్ పార్కింగ్ స్థలంలో  పేలుడు

ఘట్ కేసర్ :  ప్రమాదవశాత్తూ పాత వాహనాల పార్కింగ్ స్థలంలో పేలుడు సంభవించి మంటలు ఎగసిపడడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆర్పివేశారు. ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ ఆవరణలో వెనకాల పాత వాహనాల పార్కింగ్ స్థలం ఉంది. అందులో సీజ్ చేసిన వెహికల్స్ తో పాటు ఇతర వస్తువులు, చెత్త ఉన్నాయి. బుధవారం రాత్రి  ప్రమాదవశాత్తు పార్కింగ్ లోని చెత్తకు మంటలు అంటుకోవడమే కాకుండా పక్కనే పటాకులు పేలడంతో భారీ శబ్దం వచ్చి మంటలు ఎగిసిపడ్డాయి.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, స్టేషన్ కు వచ్చిన ప్రజలు మంటలు ఆర్పేందుకు యత్నించారు. వెంటనే ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు పూర్తిగా అదుపులోకి తెచ్చింది. చెత్త కుప్ప పక్కన పటాకులు ఉండటంతో పేలుడు సంభవించినట్టు పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన ఓ కారు స్వల్పంగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.