
- వృద్ధాప్యంలో కొడుకులు, కోడళ్ల నుంచి వేధింపులు
- దొంగతనం కేసుల్లోనూ వృద్ధులే బాధితులు
- ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్‌పై దాడులు పెరిగిపోతున్నాయి. 60 ఏండ్లకుపై బడిన తల్లిదండ్రులతో పాటు ఉద్యోగులు, కార్మికులపై వేధింపులు, హత్యాయత్నాలు, ఇండ్లలోకి అక్రమ చొరబాట్లు, మోసం, ఫోర్జరీ చేసి ఆస్తులు సొంతం చేసుకోవడం లాంటి నేరాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వృద్ధులపై జరుగుతున్న దాడులు, వేధింపులు, హత్యలపై ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన 2022 ఏడాదికి సంబంధించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.
సీనియర్ సిటిజన్స్‌పై జరుగుతున్న నేరాల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తరువాత రాష్ట్రంలోనే వృద్ధులపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది 28,545 కేసులు ఫైల్ అయ్యాయి. రాష్ట్రంలో గత మూడేండ్ల వ్యవధిలో 5,708 కేసులు నమోదు కాగా.. గతేడాది అత్యధికంగా 2,181 కేసులు రిజిస్టర్ అయ్యాయి. హైదరాబాద్‌లో గతేడాది 331 కేసులు నమోదయ్యాయి.
ఆస్తుల కోసం హత్యలు, హత్యాయత్నాలు
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 34.4 లక్షల మంది వృద్ధులు ఉన్నారు. వీరిలో రైతులు, ప్రభుత్వ, ప్రైవేట్ రిటైర్డ్ ఉద్యోగులతో పాటు కన్నకొడుకులకు దూరమైన తల్లిదండ్రులు ఉన్నారు. వీరి సంఖ్య గతేడాది నాటికి భారీగానే పెరిగింది. ఇలాంటి వృద్ధులపై రోజురోజుకూ వేధింపులు పెరిగిపోతున్నాయి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కొడుకులు, కోడళ్ల వేధింపులు ఎక్కువవుతున్నాయి.
దీంతో పాటు సీనియర్ సిటిజన్స్ ఆస్తులను ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో మోసం చేయడం, వారి ఇండ్లను కబ్జా చేయడం లాంటి ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వృద్ధులను హత్య చేయడం లేదా హత్యాయత్నం చేసి.. వారి ఆస్తులను లాక్కుంటున్నారు. అలాగే, వృద్ధ మహిళల పరువుకు భంగం కలిగించేలా దాడులు జరిగాయి. ఆస్తుల కోసం కిడ్నాప్ చేయడం, బంధించి డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకోవడంతో పాటు దోపిడీలు జరుగుతున్నాయి. .దొంగతనం కేసుల్లోనూ అధికంగా వృద్ధులే బాధితులుగా ఉంటున్నారు.
వృద్ధులైన తల్లిదండ్రులను కొడుకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంట్లో ఉన్న వృద్ధులను భారంగా పరిగణిస్తూ వేధిస్తున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురిచేస్తూ వృద్ధాప్యంలో వారి మృతికి కారకులు అవుతున్నారు. కొంత మందిని వృద్ధాశ్రమాల్లోనూ చేర్చుతున్నారు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 14 శాతం వృద్ధులే ఉంటున్నారని ఎన్‌సీఆర్‌బీ రిపోర్టులో వెల్లడైంది.