చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో ఐటీ సోదాలు

చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో ఐటీ సోదాలు
  • ఐదేండ్ల ఆర్థిక లావాదేవీలు, ఐటీ చెల్లింపులపై ఆరా
  • ల్యాప్ టాప్స్, హార్డ్ డిస్క్ లు సీజ్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ (ఐటీ) సోదాలు చేసింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు అనుమానిస్తున్న ఐటీ డిపార్ట్​మెంట్.. కేంద్ర బలగాల సెక్యూరిటీతో గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు తనిఖీలు జరిపింది. హైదరాబాద్‌‌, రంగారెడ్డి, మేడ్చల్‌‌ జిల్లాల్లోని దాదాపు 24 ప్రాంతాల్లో 73 టీమ్స్‌‌ ఆధ్వర్యంలో ఆకస్మిక సోదాలు చేసింది. జూబ్లీహిల్స్‌‌ లోని వజ్రనాథ్‌‌, కూకట్‌‌పల్లి ఇందూ ఫార్చ్యూన్ విల్లాలోని అరికెపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్‌‌‌‌ వరప్రసాద్‌‌ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.

అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లోని పూజ కృష్ణ చిట్‌‌‌‌ఫండ్స్‌‌‌‌లో దాదాపు 35 మంది ఐటీ అధికారులు సోదాలు జరిపారు. కంపెనీ డైరెక్టర్స్ నాగరాజేశ్వరి, పూజ లక్ష్మీ, ఎండీ కృష్ణ ప్రసాద్ ఇండ్లలోనూ తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌‌‌ కు చెందిన ఈ–కామర్స్‌‌‌‌ వ్యాపారి రఘువీర్‌‌‌‌‌‌‌‌ ఇల్లు, జూబ్లీహిల్స్‌‌‌‌లోని ఆఫీసులోనూ సోదాలు జరిగాయి. హైదరాబాద్‌‌‌‌ జోన్‌‌‌‌ అధికారులతో పాటు చెన్నైకి చెందిన ఆఫీసర్లు తనిఖీల్లో పాల్గొన్నారు. రఘువీర్‌‌‌‌‌‌‌‌ ఇంట్లో చెన్నై అధికారులే సోదాలు చేశారు. తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదేండ్ల ఆర్థిక లావాదేవీలు, ఆదాయ పన్ను చెల్లింపులను పరిశీలించారు. చిట్‌‌‌‌ఫండ్స్, ఫైనాన్స్‌‌‌‌ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టినోళ్ల వివరాలు సేకరించారు. ఆయా కంపెనీలు, ఓనర్ల బ్యాంక్ అకౌంట్ ట్రాన్సక్షన్లను పరిశీలించారు. రికార్డ్స్ సీజ్‌‌‌‌ చేశారు. ఆఫీసుల్లోని కంప్యూటర్ హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు స్వాధీనం చేసుకున్నారు. ‌‌‌‌కాగా, మన రాష్ట్రంతో పాటు కర్నాటక, తమిళనాడులోనూ ఐటీ సోదాలు జరిగాయి.