బడ్జెట్-2019-20 హైలైట్స్

బడ్జెట్-2019-20 హైలైట్స్

తాత్కాలికంగా ఆర్థికమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీయూష్‌ గోయల్‌ శుక్రవారం లోక్‌ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక చిట్టాలో ప్రజలను సంతృప్తి పరిచేలా ప్రతిపాదనలు చేశారు. ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. మధ్యతరగతి వేతనజీవులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్‌ వాడీ టీచర్లు.. ఇలా అన్ని వర్గాలను ఆకర్షించేవిధంగా.. గోయల్‌ తన బడ్జెట్‌ లో వరాలు కురిపించారు. నూటికి నూరుశాతం ఎన్నికల బడ్జెట్‌ ను తలపించేలా గోయల్‌ చిట్టాపద్దులు సాగాయి.

ఎన్నికల ముందు వేతన జీవులకు మోడీ సర్కారు భారీ ఊరటనిచ్చింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిన రెట్టింపు చేస్తూ.. మధ్యతరగతి ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. ఇప్పటివరకు వార్షికాదాయం రూ. 2.50 లక్షలు దాటితే ఉద్యోగులు పన్ను కట్టాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతూ మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. గృహరుణాలు, ఇంటి అద్దెలు, ఇన్సురెన్స్‌ లు కలిపి 6.50 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండబోదని తెలిపింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న మూడు కోట్ల మంది మధ్యతరగతి ఉద్యోగులు లబ్ధి  పొందనున్నారు. స్టాండర్డ్‌ డిడక‌్షన్‌ రూ.50 వేలకు పెంచినట్టు ప్రకటించిన గోయల్‌.. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. నెలకు 50 వేల జీతం వరకు టీడీఎస్‌ వర్తించబోదని, సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్ను ఉండదని  తెలిపారు.