ఐదేళ్లైనా పూర్తికాని రూ. 65 లక్షల బ్రిడ్జి: నిరసన దీక్ష చేపట్టిన గ్రామస్థులు

ఐదేళ్లైనా పూర్తికాని రూ. 65 లక్షల బ్రిడ్జి: నిరసన దీక్ష చేపట్టిన గ్రామస్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా: చీమలకొండూరు-చొల్లేరు గ్రామాలకు మధ్య అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గం ఇంఛార్జ్ బీర్ల ఐలయ్య. బ్రిడ్జి నిర్మాణం కోరుతూ..ఎన్ఎస్ యుఐ యదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్యర్యంలో.. గురువారం రెండు గ్రామాల ప్రజలు బ్రిడ్జి నిర్మాణం దగ్గర ఒక్క రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల ప్రజలకు మద్దతు తెలిపిన ఐలయ్య.. ప్రభుత్వ వైఖరిపట్ల సీరియస్ అయ్యారు. 2015లో రూ.65 లక్షల ప్యాకేజీతో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం అయితే.. ఐదేళ్లైనా పూర్తికాలేదన్నారు. కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా ఐదారు పిల్లర్లు వేసి మధ్యలోనే వదిలేశారన్నారు.

బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆలేరు, వంగపల్లికి వెళ్లాలనుకునే వారికి ఈ బ్రిడ్జి మీదుగ ప్రయాణం ఎంతో దగ్గర అని, ముఖ్యంగా వర్షాకాలంలో వాగు దాటాలంటే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు బీర్ల. ఇకనైనా అధికార పార్టీ ప్రతినిధులు మేల్కొని అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి , ప్రజలకు రవాణా సౌకర్యాన్ని అందించాలని కోరారు ఇరు గ్రామాల ప్రజలు. బ్రిడ్జి నిర్మాణంపై ప్రజా ప్రతినిధులు స్పందించకుంటే .. కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు గ్రామస్థులు.