ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ.. జీతాల పెంపు

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ.. జీతాల పెంపు
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ ఉల్లంఘనే అంటున్న ఎనలిస్టులు
  • వీళ్లందరికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను 30% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ అమలులో ఉన్న టైమ్​లో ఈ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. ఇది కోడ్​ ఉల్లంఘనే అని పొలిటికల్​ ఎనలిస్టులు అంటున్నారు. గతంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లకు జీతాలు పెంచిన సర్కార్.. అప్పుడు మేయర్లు, మున్సిపల్​ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు పెంచలేదు. ఈ నేపథ్యంలో వారి నుంచి విమర్శలు రావడంతో.. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి, జీతాల పెంపు ఉత్తర్వులిచ్చింది. 

ఇవీ పెరగనున్న జీతాలు.. 
మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్​జీతం రూ.50 వేల నుంచి రూ.65 వేలకు, డిప్యూటీ మేయర్​కు రూ.25 వేల నుంచి రూ.32,500, వార్డు మెంబర్లకు రూ.6 వేల నుంచి రూ.7,800లకు పెరగనుంది. 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్​కు రూ.15 వేల నుంచి రూ.19,500లకు, వైస్ చైర్ పర్సన్ కు రూ.7,500 నుంచి రూ.9,750, వార్డు మెంబర్లకు రూ.3,500 నుంచి రూ.4,550కి పెరగనుంది. 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్​కు రూ.12 వేల నుంచి రూ.15,600, వైస్ చైర్ పర్సన్​కు రూ.5 వేల నుంచి రూ.6,500, వార్డు మెంబర్​కు రూ.2,500 నుంచి రూ.3,250కి పెరగనుంది.