గుడ్ న్యూస్ .. రూ.8 వేలకు వీవోఏల జీతాలు పెంపు

గుడ్ న్యూస్ ..   రూ.8 వేలకు వీవోఏల జీతాలు పెంపు

హైదరాబాద్, వెలుగు: రాఖీ కానుకగా విలేజ్‌‌ ఆర్గనైజేషన్‌‌ అసిస్టెంట్ల (వీవోఏ) జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీరికి రూ.6,900 వస్తుండగా, రూ.8 వేలకు పెంచారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకులకు లబ్ధి కలగనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో 442ను జారీ చేశారు. పెరిగిన వేతనాలను వీవోఏలు అక్టోబర్‌‌‌‌లో అందుకోనున్నారు. వేతన పెంపు ద్వారా ఏడాదికి రూ.106 కోట్లు ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది. కాగా, తమ జీతాలు పెంచాలని, యూనిఫాం కోసం నిధులు కేటాయించాలని, ప్రతి మూడు నెలలకోసారి అమలవుతున్న రెన్యువల్ విధానాన్ని సవరిస్తూ దానిని ఏడాదికి పెంచాలని కోరుతున్నారు. 

అలాగే, ఇన్సూరెన్స్ అమలు చేయాలని వీవోఏలు చేసిన విజ్జప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని పంచాయితీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సీఎం ఆదేశించారు. తాము యూనిఫాం డ్రెస్ విధానాన్ని అనుసరిస్తామని, అందుకోసం నిధులు విడుదల చేయాలని వీవోఏల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ.2 కోట్లు నిధులను అందించాలని సీఎం నిర్ణయించారు. వీవోఏల విధులకు సంబంధించి, ప్రతి మూడు నెలలకోసారి చేసే రెన్యువల్ ఇక నుంచి ఏడాదికి చేసేలా సవరించాలని సీఎం నిర్ణయించారు. 

వీవోఏలతో మంత్రుల భేటీ..

గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్‌‌లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీని వీవోఏల ప్రతినిధులకు మంత్రులు దయాకర్ రావు, హరీశ్‌‌ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులకు వీవోఏ ప్రతినిధులు రాఖీ కట్టి, కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌‌‌‌కు వీవోఏల ప్రతినిధులు, మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. వీవోఏలను ఉద్దేశించి మంత్రులు, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్‌‌ సీఈవో గౌతమ్ పోట్రు మాట్లాడారు. 

వీవోఏల వేతనాల పెంపుపై సెర్ప్‌‌ జేఏసీ హర్షం..

వీవోఏల జీతం పెంపుపై సెర్ప్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. జేఏసీ చైర్మర్ కుంట గంగాధర్ రెడ్డి, నర్సయ్య, సుదర్శన్, మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌‌‌‌తోనే ఉద్యోగులకు, కార్మికులకు న్యాయం జరుగుతుందని సెర్ప్‌‌ జేఏసీ నాయకులు వెల్లడించారు. మంత్రులు హరీశ్‌‌ రావు, దయాకర్ రావులకు ధన్యవాదాలు తెలిపారు.