
- ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్‌కు 30 శాతం పీఆర్సీ
- కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ కూ వర్తింపు
- 18,600 మంది ఉద్యోగులకు లబ్ధి
హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), కేజీబీవీ ఉద్యోగులతో పాటు మోడల్ స్కూల్ హాస్టల్స్ లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తున్నట్టు సర్కారు ఎట్టకేలకు ప్రకటించింది. వారి వేతనాలను 30 శాతం పెంచుతూ శనివారం ఉత్తర్వులిచ్చింది. పెంపు ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి వర్తిస్తుందని, జులై జీతంతో కలిపి ఇస్తామని ప్రకటించింది. సమగ్రశిక్ష అభియాన్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూల్ హాస్టళ్లలో 18,600 మందికి పైగా ఎంప్లాయీస్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి కూడా 30 శాతం పీఆర్సీ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆయన ఆదేశానుగుణంగా వీరికి వేతనాలు పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు 60 శాతం జీతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే 40 శాతం వాటాకు మాత్రమే కొత్త పీఆర్సీని వర్తింపజేసేలా ప్రపోజల్స్ రూపొందించారు. దీనిపై ‘వీ6 వెలుగు’ వార్త రాయడంతో ఉద్యోగులు ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కలిసి ఆందోళన వెలిబుచ్చారు. దాంతో మొత్తం వేతనంపై 30 శాతం పెంచుతూ ప్రభత్వం ఉత్తర్వులిచ్చింది. ఎస్ఎస్ఏ పరిధిలోని సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, మెసెంజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐఈఆర్పీలు, పార్ట్ టైమ్ ఇన్ స్ట్రక్టర్స్, కేజీబీవీ పీజీ సీఆర్టీ, సీఆర్టీ, వంట సిబ్బంది, ఏఎన్ఎం, మోడల్ స్కూల్ హస్టల్ సిబ్బందికి వేతనాలు పెరగనున్నాయి. దీనిపై ఎస్ఎస్ఏ జాక్ నేతలు శ్రీధర్, సురేందర్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, కార్యదర్శి చావ రవి హర్షం వ్యక్తం చేశారు.