కొత్త టారిఫ్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన పవర్కంపెనీలు
కొన్నేండ్లుగా ఏటా పెరుగుతున్న విద్యుత్ నష్టాలు
గట్టెక్కాలంటే చార్జీలు పెంచక తప్పదని వాదన
ఈ నెలాఖరుకు ఈఆర్‌సీకి ఏఆర్‌ఆర్ నివేదిక
హైదరాబాద్, వెలుగు: గత కొన్నేండ్లుగా ఎదుర్కొంటున్న నష్టాల నుంచి బయటపడాలంటే కరెంట్ చార్జీలు పెంచక తప్పదని పవర్ కంపెనీలు భావిస్తున్నాయి. చార్జీల పెంపు కసరత్తు పూర్తి చేసి ప్రతిపాదనలను కూడా రెడీ చేశాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)ను ఈ నెల 30న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్‌సీ)కు అందించేందుకు సిద్ధమయ్యాయి.
ఏప్రిల్1 నుంచి కొత్త చార్జీలు
రాబోయే ఆర్థిక సంవత్సరానికి 4 నెలల ముందే చార్జీలపై అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్ ప్రతిపాదనలను ఈఆర్‌సీకి కరెంట్ సంస్థలు సమర్పించాలి. ఏటా నవంబర్ నెలాఖరుకు చార్జీల పెంపునకు సంబంధించి ఆదాయ అవసరాలపై ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలను ఈఆర్‌సీకి అందించాలి. గృహ వినియోగం, వ్యాపార, వాణిజ్య వర్గాలు, పరిశ్రమలు తదితర కేటగిరీలవారీగా చార్జీల టారీఫ్ ప్రతిపాదనలపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ చేపడుతుంది. ప్రజలు, పార్టీలు, నిపుణుల అభిప్రాయాలను తీసుకుని చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయం మేరకు ఏటా ఏప్రిల్1 నుంచి కొత్త చార్జీలు అమలులోకి వస్తాయి.
ఏటా నష్టాలే..
పవర్ కంపెనీలు ఏటా 60 వేల మిలియన్ యూనిట్లకుపైగా కరెంట్‌ను సరఫరా చేస్తున్నాయి. కరెంట్ సరఫరా ఖర్చుల కంటే వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో నష్టాల బారిన పడుతున్నాయి. సగటు వాణిజ్య, సాంకేతిక నష్టాలు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. ఎన్‌పీడీసీఎల్ సగటు వాణిజ్య, సాంకేతిక నష్టాలు 2017లో 16.31 శాతం ఉండగా, 2018 నాటికి 24.74 శాతానికి చేరాయి. పవర్ పర్చేజ్‌లో యావరేజీ కాస్ట్ కు సరఫరా ఖర్చు కలిపి యూనిట్ ధర సగటున ఏడు రూపాయల వరకు చేరుతోంది. ఇదే సమయంలో కలెక్షన్ ఎఫీషియెన్సీ తగ్గిపోవడంతో సరఫరా చార్జీలకు, కరెంటు బిల్లు వసూళ్లకు భారీ తేడా ఉంటోంది. దీంతో నష్టాలు తప్పడం లేదు. 2018–19లో ఎక్కువ ధరకు కరెంట్ కొనడం, సకాలంలో టారిఫ్ అందించకపోవడంతో జాతీయ స్థాయిలో రాష్ట్ర కరెంట్ పంపిణీ సంస్థల రేటింగ్ దిగజారుతోంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన జాబితాలో తెలంగాణ పవర్ సంస్థలు 23, 29వ స్థానంలో ఉన్నాయి.
తగ్గిన బడ్జెట్ కేటాయింపులు
గత ఆర్థిక సంవత్సరంలో పవర్ కంపెనీల నష్టాల అంచనా రూ.9,970.98 కోట్లు కాగా ఈ ఏడాది రూ.12 వేల కోట్ల వరకు చేరనుందని అంచనా. నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నందున కరెంట్ కంపెనీలపై అధిక భారం పడుతోంది. కంపెనీల నష్టాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సరిపోవడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.6 వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించింది. గతేడాది సబ్సిడీ కూడా రూ.5 వేల కోట్లు మించలేదు. మిగతా సగం నష్టాలను పవర్ కంపెనీలే భరించాల్సి వస్తోంది. నాలుగేళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో సంస్థలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. మూడేండ్లుగా నష్టాల్లో ఉన్నా ప్రభుత్వం ఆదుకోకపోవడం, టారిఫ్ పెంచకపోవడం, ఖర్చులు పెరిగినా సబ్సిడీ అందకపోవడంతో కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని అధికారులు అంటున్నారు.

