రియల్ ఎస్టేట్ సెక్టార్ ఫుల్ జోష్‌లో ఉంది. రెసిడెన్షియల్, కమర్షియల్ సెగ్మెంట్‌లలో సేల్స్ ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్‌లో దేశంలోని టాప్ 8 సిటీలలో ఇండ్ల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 9 శాతం పెరగగా, ఆఫీస్ డిమాండ్ 43 శాతం ఎగసింది. లగ్జరీ ఇండ్లకు, ప్రీమియం ఆఫీస్‌లకు డిమాండ్ బాగుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. తాజాగా ‘ఇండియా రియల్ ఎస్టేట్: ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్’ పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, పూణె, అహ్మదాబాద్‌లలో ఇండ్ల రేట్లు 2–13 శాతం మేర పెరిగాయని వెల్లడించింది. ఆఫీస్ రెంట్ 1–9 శాతం ఎగసిందని పేర్కొంది.
రూ. కోటి పై నుండే ఇండ్లకు పెరిగిన డిమాండ్
నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్‌లో టాప్ 8 సిటీలలో 86,345 ఇండ్లు అమ్ముడయ్యాయి. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో 79,126 ఇండ్లు సేల్ అయ్యాయి. ఇదే టైమ్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ గ్రాస్ లెవెల్‌లో 43 శాతం పెరిగి 1.62 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో 1.13 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను డెవలపర్లు లీజ్‌కు ఇచ్చారు. రూ.కోటి కంటే ఎక్కువ విలువున్న ప్రాపర్టీల అమ్మకాలు పెరుగుతున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజాల్ అన్నారు. డిమాండ్ స్ట్రాంగ్‌గా ఉందని, బయ్యర్లు లాంగ్ టెర్మ్ కోసం కొనుగోళ్లు జరుపుతున్నారనే విషయం తెలుస్తోందన్నారు. ఈ ఏడాది జనవరి–మార్చి లో ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్ రికార్డ్ లెవెల్‌లో గ్రోత్ నమోదు చేసిందన్నారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది. కంపెనీలు తమ బిజినెస్‌లను విస్తరిస్తున్నాయి. ఫలితంగా ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీలను తొలగించి పాత పద్ధతులకు షిఫ్ట్ అవుతున్నాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరగడానికి ఇదొక కారణం’ అని శిశిర్ బైజాల్ అన్నారు.
టాప్‌లో హైదరాబాద్
ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్‌లో హైదరాబాద్‌లో 9,550 ఇండ్లు అమ్ముడయ్యాయని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో రికార్డ్ అయిన 8,300 యూనిట్లతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. ఆఫీస్ స్పేస్ డిమాండ్ 8 లక్షల చదరపు అడుగుల నుంచి 30 లక్షల చదరపు అడుగులకు ఎగసింది. ఇదే టైమ్‌లో ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ఇండ్ల అమ్మకాలు 15,392 ఇండ్ల నుంచి ఒక శాతం పెరిగి 15,527 ఇండ్లకు చేరుకున్నాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ 26 లక్షల చదరపు అడుగుల నుంచి 19 శాతం పెరిగి 31 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. బెంగళూరులో ఇండ్ల అమ్మకాలు 2 శాతం తగ్గి 13,133 యూనిట్లకు పడింది. ఆఫీస్ డిమాండ్ 35 లక్షల చదరపు అడుగలు దగ్గర ఫ్లాట్‌గా ఉంది. కిందటేడాది జనవరి–మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో పూణెలో 11,832 ఇండ్లు అమ్ముడయ్యాయి. 14 శాతం గ్రోత్ నమోదు చేశాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ 8 లక్షల చదరపు అడుగుల నుంచి రెండింతలకు పైగా పెరిగి 19 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. అహ్మదాబాద్‌లో 4,673 యూనిట్లు అమ్ముడుకాగా, ఆఫీస్ స్పేస్ డిమాండ్ 5 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.