కరోనా తర్వాత పెరిగిన కంటి సమస్యలు

కరోనా తర్వాత పెరిగిన కంటి సమస్యలు
  • ఆఫీసర్లతో మంత్రి హరీశ్‌‌‌‌రావు సమీక్ష
  • ఇటీవల బడి పిల్లలపై సర్వే చేసిన ఆరోగ్యశాఖ
  • ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రారంభించే యోచన

హైదరాబాద్, వెలుగు: కంటివెలుగు కార్యక్రమాన్ని రీస్టార్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌‌‌‌లోని ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీలో బుధవారం హెల్త్ ఆఫీసర్లతో మంత్రి హరీశ్‌‌‌‌రావు ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. గతంలో మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా క్యాంపులు పెట్టి టెస్టులు చేయడం, అవసరమైన వారికి అద్దాలు అందజేయడంపై సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరగా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని హెల్త్ ఆఫీసర్లను మంత్రి ఆదేశించినట్లు సమాచారం. తొలి విడత తీరుగనే ఈసారీ సీఎం కేసీఆర్‌‌‌‌ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆఫీసర్లకు మంత్రి తెలిపారు. తొలి విడత కార్యక్రమాన్ని 2018 ఆగస్టు 15న మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లా మల్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆరోజు నుంచి 2019 మార్చి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 9,901 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి, 1,54,72,849 మందికి కంటి పరీక్షలు చేశారు. అందులో 1,04,33,854 మందికి ఎలాంటి సమస్యలు లేవని, 50,38,995 మందికి వివిధ రకాల కంటి సమస్యలున్నట్టు గుర్తించామని అప్పట్లో ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 6,42,290 మందికి క్యాటరాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (శుక్లాలు), 3,16,976 మందికి పెద్దాపరేషన్లు అవసరమని తేల్చారు. కానీ, ఆపరేషన్లు చేయించకుండానే కార్యక్రమాన్ని ముగించారు. 

వృథాగా పోయిన 5 లక్షల అద్దాలు

తొలి విడత కంటి వెలుగు కార్యక్రమం కోసం 40 లక్షలకుపైగా అద్దాలు కొనుగోలు చేశారు. కంటి పరీక్షల అనంతరం 22.93 లక్షల రీడింగ్ గ్లాసులు అందజేశారు. కంటి సమస్యలు ఉన్న మరో 18.13 లక్షల మందికి సైట్‌‌‌‌కు సంబంధించిన గ్లాసెస్ అందజేయాల్సి ఉన్నప్పటికీ అందులో 13.17 లక్షల మందికే అందజేశారు. ఇంకో 5 లక్షల గ్లాసులు ఎవరికీ అందజేయకుండా మూలన పడేశారు. 

మళ్లీ ఎందుకు?

కరోనా వల్ల జనాలు టీవీలు, సెల్‌‌‌‌ఫోన్లు, ట్యాబులు, ల్యాప్‌‌‌‌ట్యాప్‌‌‌‌లకు అతుక్కపోవడం, గంటల కొద్దీ స్ర్కీన్ చూడడం వల్ల చాలా మందికి కంటి జబ్బులు వచ్చాయి. దీంతో అన్ని జిల్లాల్లోనూ పిల్లలతో పాటే పెద్దవాళ్లకూ కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించి, కంటివెలుగు పున:ప్రారంభంపై సమీక్షలు జరుపుతున్నారు.