పెరిగిన జ్యుయెలరీ డిమాండ్​

పెరిగిన జ్యుయెలరీ డిమాండ్​

హైదరాబాద్​, వెలుగు: గోల్డ్​ జ్యుయెలరీ డిమాండ్​ఎక్కువగా ఉన్న దేశాలలో మనం రెండో ప్లేస్​లో నిలిచాం. 2021లో ఇండియాలో  మొత్తం 611 టన్నుల గోల్డ్‌  జ్యుయెలరీని కొన్నారు. 673 టన్నుల గోల్డ్​ జ్యుయెలరీ కొనుగోళ్లతో చైనా  మనకంటే ముందుందని ఒక రిపోర్టు వెల్లడించింది. జ్యుయెలరీ డిమాండ్​ అండ్​ ట్రేడ్​ పేరిట వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ గురువారం నాడు ఒక రిపోర్టును రిలీజ్​ చేసింది.  అంతేకాదు, మన దేశం నుంచి బంగారం ఆభరణాల ఎగుమతులు కూడా గత కొన్నేళ్లలో భారీగా పెరిగాయి. 

ఎగుమతుల జోరు...

2015 లో మన దేశపు ఆభరణాల ఎగుమతులు 7.6 బిలియన్​ డాలర్లుండగా, 2019 నాటికి ఇవి 12.4 బిలియన్​ డాలర్లకు చేరడం విశేషం. మన దేశంలో బంగారపు ఆభరణాలను ఎక్కువగా పెళ్లిళ్ల కోసమే కొనుగోలు చేస్తున్నట్లు డబ్ల్యూజీసీ ఈ రిపోర్టులో పేర్కొంది. మొత్తం గోల్డ్​ జ్యుయెలరీ అమ్మకాలలో   పెళ్లిళ్ల కోసం కొనుగోలు చేసే వారు 50 నుంచి 55 శాతం దాకా ఉంటున్నట్లు వివరించింది. ఇండియాలో అమ్ముడవుతున్న గోల్డ్​ జ్యుయెలరీ లో 80–85 శాతం వాటా ప్లెయిన్​ జ్యుయెలరీదే. వీటిని 22 క్యారెట్ల గోల్డ్​తో తయారు చేస్తారు. ఇటీవల కాలంలో 18 క్యారెట్ల గోల్డ్​ జ్యుయెలరీకి కూడా డిమాండ్​ పెరుగుతోంది. మొత్తం గోల్డ్​ జ్యుయెలరీ డిమాండ్​లో రోజూ పెట్టుకునేందుకు కొనుగోలు చేసే ఆభరణాల వాటా 40 నుంచి 45 శాతం దాకా ఉంటుందని రిపోర్టు పేర్కొంది.

రూరల్​ డిమాండే ఎక్కువ....

ఇండియాలో బంగారపు ఆభరణాల కొనుగోళ్లు రూరల్​ ఏరియాలోనే ఎక్కువని కూడా వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ రిపోర్టు చెబుతోంది. మొత్తం గోల్డ్​ జ్యుయెలరీ కొనుగోళ్లలో పల్లెల్లోని ప్రజల కొనుగోళ్లు 55–58 శాతమని పేర్కొంటోంది.  గోల్డ్​ జ్యుయెలరీని మన దేశంలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నది మిడిల్​ క్లాసేనని కూడా ఈ రిపోర్టు తెలిపింది. బంగారపు ఆభరణాల కొనుగోలులో దేశంలో దక్షిణాది రాష్ట్రాలే ముందుంటున్నట్లు పేర్కొంది. దేశంలోని బంగారపు ఆభరణాల డిమాండ్​లో దక్షిణాది రాష్ట్రాల వాటా 40 శాతమని వివరించింది. 2021 లో ఇండియా జెమ్​ అండ్​ జ్యుయెలరీ ఎగుమతులలో గోల్డ్​ జ్యుయెలరీ వాటా 23 శాతానికి చేరినట్లు పేర్కొంది.

యూత్ ​మెచ్చట్లే.....

గత కొన్నేళ్లలో ఇండియాలోని గోల్డ్​ మార్కెట్​లో చాలా మార్పులు వచ్చాయని ఈ రిపోర్టు ప్రస్తావించింది. ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి నియంత్రణలు మారితే, మరోవైపు కన్జూమర్​ బిహేవియర్​లోనూ మార్పు వచ్చిందని వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ రిపోర్టు పేర్కొంది. ఈ రెండు సవాళ్లను ఇండస్ట్రీ ఎదుర్కోవలసి వచ్చిందని తెలిపింది. యువతరం బంగారపు ఆభరణాల కంటే ఇతర జ్యుయెలరీని ఇష్టపడటం వంటి కొత్త  సవాళ్లు ఇప్పుడు ఎదురవుతున్నట్లు పేర్కొంది. డిఫరెంట్​ స్టైల్​ జ్యుయెలరీ లేదా లగ్జరీ ఫ్యాషన్ యాక్సెసరీస్​ వైపు యువతరం మళ్లుతున్నట్లు వివరించింది. దేశం ఆర్థికంగా బలపడుతున్న క్రమంలో గోల్డ్​ జ్యుయెలరీ డిమాండ్​ కూడా జోరందుకుంటుందని వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ అంచనా వేస్తోంది. గోల్డ్​ జ్యుయెలరీ తయారీ, ఎగుమతులు పెంచడంపై ప్రభుత్వం ఫోకస్​ పెడుతున్నట్లు కూడా డబ్ల్యూజీసీ రిపోర్టు తెలిపింది. రాబోయే ఏళ్లలో ఈ ఫోకస్​ మరింత పెరుగుతుందని పేర్కొంది.

బంగారం ఆభరణాల వినియోగంలో  రెండో  ప్లేస్​లో ఉన్న ఇండియా గ్లోబల్​ మార్కెట్లో చాలా కీలకమైనది. పెళ్లిళ్లు, పండగలు ఇండియాలో గోల్డ్​ జ్యుయెలరీ డిమాండ్​ను పెంచుతున్నాయి. గోల్డ్​ జ్యుయెలరీని ఇష్టపడటమనేది వందలాది ఏళ్లుగా దేశంలో కొనసాగుతోంది. గ్లోబల్​ ట్రేడ్​లో ఇండియా వాటా ఎక్కువవడానికి ఇది దోహదపడుతోంది.

- పీఆర్​ సోమసుందరం , రీజినల్​ సీఈఓ, 
డబ్ల్యూజీసీ ఇండియా