
‘దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన అశోక్ గత శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేశాడు. బస్సు ప్యాసింజర్లతో కిక్కిరిసిపోయింది. కాల్ రావడంతో మాట్లాడి ఫోన్‌ను జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ కోసం జేబులో చేయి పెట్టగా కనిపించలేదు. ఎవరో కొట్టేశారని గుర్తించి చుట్టుపక్కల ఉన్న వారి వద్ద చెక్ చేశాడు. అయినా దొరకలేదు. అప్పటికే మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది.
‘పహడీషరీఫ్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ లాల్‌రెడ్డి సెల్‌ఫోన్ ఏడాది కిందట చోరీకి గురైంది. క్యాబ్‌లో ప్యాసింజర్స్‌గా వచ్చిన ముగ్గురు యువకులు ఫోన్ దొంగిలించినట్లు అతడు గుర్తించాడు. పహడీషరీఫ్ పీఎస్‌లో కంప్లయింట్ చేశాడు. అయితే కంప్లయింట్ తీసుకున్న పోలీసులు సెల్‌ఫోన్‌ను ట్రేస్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదంటూ వారి తీరుపై లాల్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశాడు.’
హైదరాబాద్, వెలుగు: పిక్ పాకెటర్లు రూటు మారుస్తున్నారు. కొట్టేసిన పర్సుల్లో కార్డులు తప్ప క్యాష్ దొరక్కపోవడంతో సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నారు. బస్సులు, రైల్వేస్టేషన్స్, షాపింగ్ మాల్స్, పార్కులకు వచ్చే వారిని టార్గెట్ చేస్తూ.. చాకచక్యంగా స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. రోడ్డుపై ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్న వారి చేతిలో నుంచి ఫోన్ లాక్కుని ఉడాయిస్తున్నారు. వీలైతే చైన్ స్నాచింగ్‌కు కూడా పాల్పడుతున్నారు. ఇలా సిటీలో ప్రతి రోజు 15 నుంచి 20 మొబైల్ ఫోన్లు చోరీకి గురవుతున్నట్లు తెలుస్తోంది. కొట్టేసిన సెల్‌ఫోన్లను ఢిల్లీ, ముంబయికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.
ముందస్తుగా రెక్కీ..
డిజిటల్ పేమెంట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రాకముందు సిటీలో జేబు దొంగలు ఎక్కువగా ఉండేవారు. రద్దీ ప్రాంతాల్లో క్షణాల్లో పర్సులు కొట్టేసేవారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి పర్సులో ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు తప్ప క్యాష్ పెద్దగా ఉండటం లేదు. దీంతో పిక్ పాకెటర్లు రూట్మార్చి సెల్‌ఫోన్, చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు. ముందస్తు రెక్కీ, స్నాచింగ్ చేసి పారిపోవడం కోసం నలుగురి సభ్యులకు తగ్గకుండా ముఠాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒంటరిగా ఉన్న వ్యక్తులనే టార్గెట్ చేసి స్మార్ట్ ఫోన్లను కొట్టేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల్లోనూ రెక్కీ చేసి స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు.
ఢిల్లీ, ముంబయికి పార్సిల్..
స్నాచింగ్ కోసం ఖరీదైన ఫోన్లనే దొంగలు సెలక్ట్ చేసుకుంటున్నారు. బస్సులు, రైళ్లు సహా పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సెల్‌ఫోన్ మాట్లాడే వారిని వెంబడిస్తున్నారు. అదునుచూసి సెల్‌ఫోన్ లాక్కుని పారిపోతున్నారు. ఆర్టీసీ బస్సులు, రైల్వే స్టేషన్లలోనూ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొట్టేసిన ఫోన్లను వెంటనే స్విచ్ ఆఫ్ చేసి, సిమ్ కార్డులను విరగ్గొట్టడం లేదా డ్రైనేజీల్లో పడేస్తున్నారు. ఆ ఫోన్లను అంతర్రాష్ట్ర ముఠాలకు అమ్మేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ, ముంబయికి చెందిన రిసీవర్లు సిటీలో నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా సెల్‌ఫోన్లను సేకరించి పార్సిల్ చేస్తున్నారు. వీటిని 4, 5 నెలల వరకు ఆన్ చేయడం లేదు. దీంతో ఐఎమ్‌ఈఐ నంబర్స్ ఉన్నా పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారు.
ఐఎంఈఐ నంబర్ ఉన్నా ట్రాక్ కావట్లే..
సెల్‌ఫోన్ చోరీల కేసులను పోలీసులు లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదులతో కొన్ని ఐఎంఈఐ నంబర్లను ట్రాకింగ్‌లో పెట్టినప్పటికీ ఫాలో అప్ చేయడం లేదు. సాధారణంగా సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను సర్వీస్ ప్రొవైడర్‌తో కలిసి కో ఆర్డినేట్ చేస్తుంటారు. దీన్ని ప్రతి వారం షెడ్యూల్ ప్రకారం ఆపరేట్ చేస్తుండాలి. మొబైల్ స్విచ్ ఆన్ చేసి అందులో సిమ్ కార్డ్ వేస్తే తప్ప సెల్‌ఫోన్ ట్రాకింగ్‌కి అవకాశం లేదు. దీంతో ఐఎంఈఐ ట్రాక్ కాని ఫోన్లను రికవరీ చేయడంపై దృష్టిపెట్టడం లేదు. ఇలాంటి ఫోన్లు కొన్ని నెలల తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఆన్ అవుతున్నాయి. వాటిని గుర్తించినప్పటికీ రికవరీపై పోలీసులు ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
సెల్‌ఫోన్ దొంగలపై నిఘా పెట్టాం
సెల్‌ఫోన్ అఫెండర్స్‌పై నిఘా పెట్టాం. ఇటీవల మాదన్నపేటకు చెందిన మహ్మద్ ఇషాక్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం. 9 సెల్‌ఫోన్లు సీజ్ చేశాం. ఐఎంఈఐ నంబర్ ద్వారా ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించే అవకాశం ఉంది. పీఎస్‌లో నమోదైన కేసులు, హాక్ ఐలో వచ్చిన కంప్లయింట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. మొబైల్లో సిమ్ కార్డ్ వేసి ఆపరేట్ చేస్తే ట్రేస్ అవుతుంది. బాధితులు పోగొట్టుకున్న సెల్‌ఫోన్ వివరాలను హాక్ ఐ అప్లికేషన్ల ద్వారా అందించాలి. స్థానికంగా ఉన్న ఫోన్లు రికవరీ అవుతున్నాయి.
– చక్రవర్తి, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ