
‘ఆపరేషన్ సిందూర్’ వేళ అమెరికా డబుల్ గేమ్ ఆడింది. ఒకవైపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF) ద్వారా వంద మిలియన్ డాలర్ల రుణాన్ని పాకిస్తాన్కు ఇప్పించడంలో అమెరికా పరోక్షంగా సహాయం చేసింది. మరోవైపు ఇండియాకు తీవ్రవాదంపై పోరుకు సంపూర్ణ మద్దతు అందిస్తామని తెలియజేసింది. ఇది ఇలా ఉండగా మధ్యలో అమెరికా ఛానల్ సిఎన్ఎన్ ద్వారా పాకిస్తాన్ ఇండియాకు చెందిన రాఫెల్ యుద్ద విమానాన్ని కూల్చివేసిందనే వార్తను టెలికాస్ట్ చేసింది. తత్ఫలితంగా ప్రాన్స్ దేశం వద్ద కొనుగోలు చేసిన రాఫెల్ విమానం తయారీ, నాణ్యతల పట్ల అనేక శంకలు రేకెత్తాయి.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. దీనికి సమాంతరంగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, విమానాలు లక్ష్యాలను ఛేదించకముందే నిర్వీర్యరింపరిచి మన దేశం పైచేయి సాధించింది. అంతేగాక పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేశాయి. మన సైన్యం అత్యాధునిక యుద్ధ నైపుణ్య పరికరాలతో శత్రుదేశం ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని ఆయా ప్రాంతాలని విధ్వంసం చేసి పాకిస్తాన్ కు తగిన బుద్ది చెప్పడమే కాకుండా తగిన మూల్యం చెల్లించుకునేలా చేసింది. తద్వారా చైనా పాకిస్తాన్కు సరఫరా చేసిన యుద్ధ సామగ్రి పట్ల కొంతమేరకు అనుమానాలు ఏర్పడ్డాయి.
ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ అణు బెదిరింపులకు భయపడేది లేదని, ఇకముందు ఉగ్రవాదులు చేసే ప్రతి సంఘటనలను యుద్ధచర్యగా భావిస్తామని దేశవాసులకు, శత్రుదేశానికి తగు రీతిన సమాధానం హెచ్చరిక రూపంలో చెప్పాడు. అయినప్పటికీ రెండో ప్రపంచ యుద్ధకాలంలో అమెరికా వైఖరి గురించి జరిగిన ఒక సంఘటనను ఇక్కడ ఈ సందర్భంలో మీతో పంచుకోవాలి.
జర్మనీ వద్ద అణుబాంబు ఉందనే నెపంతో అమెరికాలో అణుతయారీకి తగు సాంకేతిక సహాయం చేశాడు అల్ఫ్రెడ్ నోబెల్. అనంతరం జర్మనీ వద్ద అటువంటి మారణాయుధం ఏదీ లేదని తెలిసిపోయింది. ఆ పిదపనే ఆయన అమెరికాను అణుబాంబు ఉత్పత్తి ఆపివేయాలని కోరాడు. కానీ అమెరికా అప్పటికే అణుబాంబులు తయారుచేసి జపాన్ పైన వేసి కనీవినీ ఎరుగని మానవ వినాశనానికి కారణమైనది.
అప్పుడు నోబెల్.. అమెరికా నాయకులతో ఈ విషయం ప్రస్తావిస్తే, ఆయనకు మేం అణుబాంబులు ఉత్పత్తి చేయగలగడమే కాదు, యుద్ధాలను కూడా ఉత్పత్తి చేయగలం అని చెప్పారు. అనంతరం తన జీవితకాలంలోనే మానవాళి మేలుకోసం కనుగొన్న డైనమైట్ మూల సాంకేతిక పరిజ్ఞానం పక్కదారి పట్టి మానవ హననానికి ఉపయోగపడడం వలన చాలా మదనపడ్డాడు.
అమెరికా అప్పుడూ ఇప్పుడూ ప్రపంచంలో జరిగిన జరుగుతున్న ప్రతి సంక్షోభం, సంఘటనను ఇదే డబుల్ స్టాండర్డ్ రాజకీయ నిర్ణయాలు ముఖ్యంగా తన వ్యాపార ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యతగా ఉపయోగించుకోవడం పరిపాటిగా జరుగుతున్నది.
జూకంటి జగన్నాథం, కవి, రచయిత