వందల్లో గర్భిణులు అయినా..ఒక్కరే డాక్టర్​

వందల్లో గర్భిణులు అయినా..ఒక్కరే డాక్టర్​
  • పని ఒత్తిడితో ఆగమైతున్న ప్రభుత్వ గైనకాలజిస్టులు
  • సగానికిపైగా గైనకాలజిస్టు పోస్టులు ఖాళీ
  • నార్మల్ డెలివరీలు చేయాలంటున్న అధికారులు
  • డాక్టర్ల కొరతతో ఉన్న వాళ్లపై పనిభారం

హైదరాబాద్‌, వెలుగు:  జగిత్యాల జిల్లా హాస్పిటల్లో నెలకు సగటున 340 నుంచి 350 డెలివరీలు జరుగుతున్నాయి. ఇక్కడ కేవలం ముగ్గురు గైనకాలజిస్టులు మాత్రమే పని చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లా హాస్పిటల్లో నెలకు సగటున 330 డెలివరీలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ముగ్గురే డాక్టర్లు ఉన్నారు.

…ఈ రెండు ఆస్పత్రుల్లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా ఇదే పరిస్థితి. ప్రభుత్వ దవాఖానాల్లో గైనకాలజిస్టుల కొరత, ఉన్న వారిపై పని భారం ఎంతలా ఉందో ఈ ఉదాహరణలు చెప్పకనే చెబుతున్నాయి. ఒక్కో డాక్టర్‌‌ సగటున రోజుకు ఆరు నుంచి ఏడు డెలివరీలు చేయాల్సి వస్తోంది.

లక్ష్యం సరే.. చర్యలేవీ?

సర్కారు ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా గైనకాలజిస్టు పోస్టులను భర్తీ చేయడంలో విఫలమవుతోంది. ప్రభుత్వ మాతా శిశు కేంద్రాల ఏర్పాటు, నగదు ప్రోత్సాహకం, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలల్లో బిల్లులు వేస్తుండటం వంటివాటితో ప్రభుత్వ దవాఖానాలకు వచ్చే గర్భిణుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం మొత్తం ప్రసవాల్లో 60 శాతం గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా దీన్ని ఘనంగా చాటుకుంది. ‘ఒకే రోజులో ఇన్ని డెలివరీలు చేశాం.. అన్ని డెలివరీలు చేశాం’ అంటూ గతంలో కొంత మంది డాక్టర్లు గొప్పగా ప్రకటించుకున్నారు. ప్రసవం కోసం గర్భిణి రావడం ఆలస్యం.. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశముందా లేదా అన్నది చూడకుండా సిజేరియన్ చేయడం మొదలు పెట్టారు. ప్రసవాల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ఉన్నతాధికారులు కూడా ఈ పద్ధతిని ప్రోత్సాహించారు. కొందరు డాక్టర్లు వ్యతిరేకించినా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. చివరకు దేశంలోనే అత్యధిక సిజేరియన్లు జరగుతున్న రాష్ర్టంగా తెలంగాణ  అప్రతిష్ట ముటగట్టుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారుల హెచ్చరికలతో ఇప్పుడు నార్మల్ డెలివరీల కోసం గైనకాలజిస్టులపై ఒత్తిడి చేస్తున్నారు.

అందుకే సిజేరియన్లు!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలకు అనుగుణంగా డాక్టర్లు లేకపోవడంతో ఉన్నవారిపైనే భారం పెరిగింది. సిజేరియన్ల వైపు మొగ్గు చూపడానికి ఇదే ముఖ్య కారణమని గైనకాలజిస్టులు చెబుతున్నారు. డెలివరీలు, ఓపీకి వచ్చే గర్భిణులను, బాలింతలను పరీక్షించడం, వార్డుల్లో ఉన్న బాలింతలను పర్యవేక్షించడంతోపాటు అవసరమైన సూచనలు చేయాల్సి ఉంటుంది. దీంతో ముగ్గురు డాక్టర్లు ఉన్న చోట.. ప్రతి మూడ్రోజులకొకసారి ఒకరు నైట్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఇంత పని భారంలో నార్మల్ డెలివరీ కోసం గంటల తరబడి వేచి చూడడం ఎలా సాధ్యమవుతుందని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నారు. ఇంత పని చేస్తున్నా వారికి ప్రభుత్వం ఇస్తానన్న ఇన్సెంటివ్స్ ఇవ్వకపోవడం గమనార్హం. కేసీఆర్‌‌‌‌ కిట్‌‌ పథకంలో భాగంగా డెలివరీలకు ఇన్సెంటివ్స్‌‌ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.

ఖాళీగా పోస్టులు.. నిండుగా ఓపీ షీట్

ప్రభుత్వ దవాఖాన్లలో ప్రస్తుతం 40 శాతానికిపైగా డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గైనకాలజీ స్పెషలిస్టుల విషయంలోనూ ఇదే పరిస్థితి. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌‌లో 570 గైనిక్ పోస్టులుండగా, ఇందులో 310 ఖాళీగానే ఉన్నాయి. టీచింగ్ హాస్పిటళ్లలో 263 గైనిక్ ప్రొఫెసర్‌‌‌‌ పోస్టులకుగానూ 135 ఖాళీగానే ఉన్నాయి. ప్రసవాల సంఖ్య పెరగడం, ప్రభుత్వం రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో కొన్ని హాస్పిటళ్లలో కాంట్రాక్ట్‌‌ పద్ధతిపై డాక్టర్లను తీసుకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు హాస్పిటళ్లలో గైనకాలజిస్టులకు మస్తు డిమాండ్‌‌ ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఒత్తిడితో పన్జేసేందుకు గైనకాలజిస్టులు ముందుకురావడంలేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా నాలుగైదు నెలలకు మించి ఉండడంలేదు. రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే జీతం కంటే, కాంట్రాక్ట్ వాళ్లకు ఎక్కువ శాలరీ ఇవ్వాలని నిర్ణయించినా.. గైనకాలజిస్టులు రావడంలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఖాళీలు భర్తీ చేయాలె

నాలుగైదేండ్లలో సర్కారు తీసుకున్న చర్యలతో ప్రభుత్వ దవాఖాన్లపై నమ్మకం ఏర్పడింది. ఒకప్పుడు 30 శాతం డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటళ్లలో జరిగితే, ఇప్పుడు ఆ సంఖ్య 60 శాతానికి పెరిగింది. తొలి కాన్పు విషయంలో సిజేరియన్లల సంఖ్య ఇప్పుడు కొంత తగ్గింది. దీన్ని ఇలాగే కొనసాగించాలంటే సరిపడా డాక్టర్లు ఉండాలి. వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల ప్రకారం సిజేరియన్ డెలివరీలు 15–20% దాటొద్దు . ఈ మార్క్‌‌ను మనం చేరుకోవాల్సి ఉంది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, నార్మల్‌‌ డెలివరీలు ఎక్కువగా చేసే డాక్టర్లకు ప్రోత్సహకాలు ఇస్తే
డబ్ల్ యూహెచ్‌ వో మార్క్‌‌ను చేరుకోవచ్చు.

– డాక్టర్‌‌‌‌ లాలూ ప్రసాద్‌‌,
ప్రభుత్వ డాక్టర్ల సంఘం