పసికందులపై పైశాచికాలు

పసికందులపై పైశాచికాలు

అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చిర్రకుంట గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. చిర్రకుంట గ్రామానికి చెందిన నైతం జ్ఞానేశ్వర్ (28) తమ ఇంటి బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేశాడు. చిన్నారి తండ్రి కూలి పని చేసి ఇంటికొచ్చి తలుపులు తెరవగానే జ్ఞానేశ్వర్ పరారయ్యాడు. పిల్లలను విషయం అడగ్గా జరిగిందంతా చెప్పారు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం జరిగిందని డాక్టర్లు తెలిపారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు ఇద్దరు చిన్నారుల్లో ఒకరికి మామ, మరొకరికి సోదరుడు అవుతారని చెప్పారు.

ముక్కుపచ్చలారని చిరుప్రాయాన్ని చిదిమేస్తున్నరు. అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లల ప్రాణాలను మొగ్గలోనే తుంచేస్తున్నరు. మాయమాటలు చెప్పి అఘాయిత్యాలకు పాల్పడుతున్నరు. నెలల వయసున్న చిట్టితల్లులపై లైంగిక దాడికి పాల్పడి, ఊపిరి తీస్తున్నరు. ఆఖరికి తల్లి పక్కలో నిద్రపోతున్న బిడ్డలను కూడా వదలడం లేదు. ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తెలిసినవారే నమ్మబలికి లైంగిక దాడికి పాల్పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఎవరినీ నమ్మలేకపోతున్నరు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన పిల్లలు తిరిగి వచ్చేదాకా ఏం జరుగుతుందోనని టెన్షన్‌ పడుతున్నారు. ఇటీవల హన్మకొండలో 9 నెలల పసిగుడ్డుపై అత్యాచారం, హత్య చేసిన ఘటన యావత్‌ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒంగోలు, మేడ్చల్‌, హైదరాబాద్​లోని రామంతాపూర్‌, పెద్దపల్లి, నేరేడ్‌మెట్‌, వికారాబాద్‌లలో చోటుచేసుకుంటున్న వరుస ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

కఠిన చట్టాలున్నా..

పెరుగుతున్న టెక్నాలజీతో ఎన్నో బూతు వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నయి. స్మార్ట్‌ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉంటుండటంతో విచ్చలవిడిగా అశ్లీల వీడియోలను చూస్తూ సెక్స్‌కు ప్రేరేపితులవుతున్నారు. వీటికి తోడు డ్రింకింగ్, డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా అత్యాచారాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ చట్టాలపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం వల్ల నేరస్తులకు భయం లేకుండాపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఏటా పెరుగుతున్నయి..

బాలికలపై లైంగిక దాడులు ఏటా పెరుగుతున్నాయి. 2013 నుంచి 2019 జనవరి వరకు పోక్సో చట్టం కింద 8,142 కేసులు బుక్‌ అయ్యాయి. 2013లో 281 కేసులు నమోదు కాగా, 2018లో ఇది 2,080కు చేరింది. ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్రంలో 137 కేసులు రిజిస్టరయ్యాయి. వికారాబాద్ జిల్లాలోనే 30 కేసులు నమోదయ్యాయి. ఈ ఆరేళ్లలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 967 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇవి నమోదు చేసిన కేసులే. బయటకు రానివి ఎన్నో ఉన్నాయి.

ఈ నెలలో జరిగిన ఘటనలు

జూన్‌ 13 : వరంగల్‌ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి, పాపను చంపేశాడు.

జూన్‌ 20 : హైదరాబాద్​లోని రామంతాపూర్​లో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు.

జూన్‌ 22 : పెద్దపల్లి జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థినిపై ఓ అటెండర్‌ లైంగికదాడికి యత్నించాడు.

జూన్‌ 22 : మేడ్చల్  పరిధిలో 55 ఏళ్ల వృద్ధుడు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు.

జూన్‌ 22 : నేరేడ్‌మెట్‌ పీఎస్‌ పరిధిలో మద్యం మత్తులో కూతురిపై ఓ తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

జూన్‌ 24 : కొత్తగూడెం జిల్లాలో నిద్రిస్తున్న బాలికను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.

జూన్‌ 24 : వికారాబాద్ జిల్లాలోని ఓ తండాలో బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

జూన్‌ 24: ఒంగోలులో ఓ బాలికపై కామాంధులు గ్యాంగ్‌ రేప్‌ చేశారు.