నిండు కుండలా నాగార్జునసాగర్.. మొత్తం 26 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల

నిండు కుండలా నాగార్జునసాగర్.. మొత్తం 26 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రాజెక్ట్ గరిష్ట స్థాయి నీటిమట్టానికి ప్రవాహం చేరుకోవడంతో మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తారు. 2 లక్షల10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి  కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఇన్ ఫ్లో విషయానికొస్తే.. 2 లక్షల 55 వేల 811 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 2 లక్షల 47 వేల 213 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 587.60 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ : 305.8626 టీఎంసీలు.

కృష్ణా నదికి వరద పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరుగుతున్నది. ఇటు గోదావరి బేసిన్లోనూ వరద క్రమంగా పుంజుకుంటున్నది. శ్రీరాంసాగర్​ప్రాజెక్టులోకి ఒక్కరోజులోనే 6 టీఎంసీలకుపైగా నీళ్లు  వచ్చి చేరాయి. కృష్ణా బేసిన్లో శ్రీశైలం ప్రాజెక్టుకు మూడు సోర్సుల ద్వారా నీళ్లు వస్తున్నాయి. సుంకేశుల, తుంగభద్ర, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నది. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి చేరుకుంటున్నది.

దీంతో పోతిరెడ్డిపాడుకు 31 వేల క్యూసెక్కులు, నాగార్జునసాగర్​వైపు 1.50 లక్షల క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేశారు. మంగళవారం నాటికి ఇన్​ఫ్లో మరింత పెరిగింది. వరద ప్రవాహాలు ఎక్కువగా ఉండడంతో మంగళవారం నాగార్జునసాగర్​ ప్రాజెక్టు గేట్లను ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి లిఫ్ట్ చేశారు. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు కూడా వరద క్రమంగా పెరుగుతున్నది. ఇన్నాళ్లూ ప్రాజెక్టుకు డ్రై స్పెల్​కొనసాగగా.. ప్రస్తుతం 65 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.