‘తాగి దొరికితే కేసు పెడతావా..?’ నల్గొండ పీఎస్లో నిప్పంటించుకున్న మందు బాబు!

‘తాగి దొరికితే కేసు పెడతావా..?’ నల్గొండ పీఎస్లో నిప్పంటించుకున్న మందు బాబు!

నల్గొండ: గంజాయి, మద్యం మైకంలో కొందరు యువత రోడ్లపై అర్థరాత్రి​​​ హల్చల్ చేస్తుండటంతో నల్లొండ పోలీసులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి DVK రోడ్లో వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. అయితే.. ఈ టెస్ట్లో ఒక తాగుబోతు ఫుల్గా మద్యం తాగి దొరికిపోయాడు. రావిళ్ల నర్సింహా అనే వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. 155mg/100ml ఆల్కహాల్ రీడింగ్ చూపించింది.

దీంతో.. నర్సింహ అనే ఈ మందుబాబుపై ఎస్ఐ సైదులు కేసు నమోదు చేశారు. నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే.. తాగిన మైకంలో ఉన్న నర్సింహ తనపై కేసు ఎలా నమోదు చేస్తావని నానా రచ్చ చేశాడు. పెట్రోల్ పోసుకొని నల్గొండ 1 టౌన్ పోలీసు స్టేషన్ లోపలికి వెళ్లాడు. పార్కింగ్ స్థలంలోనే హోంగార్డ్ ప్రవీణ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

హోం గార్డ్ తన దగ్గరికి వస్తుండటం గమనించిన.. నర్సింహ లైటర్తో నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ భయపడ్డారు. వెంటనే తేరుకొని బెడ్ షీట్ కప్పి అంజత్ అనే కానిస్టేబుల్ మంటలు ఆర్పేశాడు. చికిత్స నిమిత్తం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆత్మహత్యాయత్నం చేసుకున్న నర్సింహ పరిస్థితి సీరియస్గా ఉంది. అతనిని కాపాడే క్రమంలో హోంగార్డ్ ప్రవీణ్ చేతులకి గాయాలయ్యాయి. పోలీస్ అధికారుల విధులను అడ్డగించి, అర్ధరాత్రి తాగిన మైకంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రావిళ్ల నర్సింహపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు మరో కేసు కూడా నమోదు చేశారు.