పోలీస్ శాఖలో పెరుగుతున్న సస్పెన్షన్‌లు

పోలీస్ శాఖలో పెరుగుతున్న సస్పెన్షన్‌లు

నేరస్తులను అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాల్సిన  పోలీసులే నేరాలు చేస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే  తప్పులు చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే సెటిల్ మెంట్లు,దందాల పేరుతో  దోచుకుతింటున్నారు. చివరికి తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. సస్పెన్షన్ కు గురవుతూ పోలీస్ శాఖకు మాయనిమచ్చగా మారుతున్నారు.

ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. నార్సింగ్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ను, ఎస్‌ఐ లక్ష్మణ్‌ను  సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌రవీంద్ర రెండు రోజుల క్రితం సస్పెండ్‌ చేశారు. భూ వివాదాలకు సంబంధించిన అవినీతి ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్‌ చేశారు. ఇటీవల భూ వివాదాలలో వీళ్లు తలదూర్చడంతో పాటు అవినీతి ఆరోపణలు అధికంగా రావడంతో సీపీ అంతర్గత విచారణ చేపట్టి ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నార్సింగ్‌, కోకాపేటలో కూడా కొంతమంది బాధితులు వీళ్లపై ఫిర్యాదు చేశారు. సస్పెండ్‌ అయిన ఎస్‌ఐ లక్ష్మణ్‌ రెండు నెలల క్రితం సైబరాబాద్‌ ఈఓడబ్ల్యుకు బదిలీ అయ్యారు. నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌  గంగాధర్ ఏడాదికి పైగా సర్వీసు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం కొల్లూరు-జన్వాడ మధ్య కొనసాగుతున్న భూ వివాదాల్లో తలదూర్చినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు పడిందని తెలుస్తోంది.  గతంలోనూ పలు సివిల్‌, భూవివాదాల్లో ఆయన ప్రమేయముందని, బాధితుల సంఖ్య ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. జన్వాడ మాత్రమే కాకుండా నెక్నాంపురాలోనూ కోట్ల విలువ చేసే ఓ భూవివాదంలో చట్టం పరిధి దాటి తలదూర్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

నాలుగు రోజుల క్రితమే సరూర్‌నగర్‌ ఎస్‌ఐ సైదులును రాచకొండ సీపీ సస్పెండ్‌ చేశారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా నేరస్తుడితో విజయవాడకు విహారయాత్రకు వెళ్లి వచ్చారు.    తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక.. అధికారాన్ని వినియోగించుకొని తనను బెదిరించాడని సదరు నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఎస్‌ఐతో దిగిన ఫొటోలు, హోటల్‌ బిల్లులు తదితర ఆధారాలన్నింటినీ జత చేశాడు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపిన సంబంధిత అధికారులు ఎస్‌ఐని సస్పెండ్‌ చేశారు. 

ఆరు నెలల క్రితం రాచకొండ కమీషనరేట్ పరిధిలోని చౌటుప్పల్‌ పీఎస్ సీఐ వెంకన్న, ఎస్‌ఐ నర్సయ్య లు భూవివాదంలో తలదూర్చినందుకు సస్పెండ్ చేశారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. స్థానిక ఏసీపీ సత్తయ్యకు చార్జ్‌ మెమో జారీ చేశారు. . చౌటుప్పల్ పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమికి సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై భువనగిరి కోర్టు పట్టాదారుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే కోర్టు ఉత్తర్వులను ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న, ఎస్‌ఐ నర్సయ్య ఖాతరు చేయకుండా భూ యజమానిపై వేధింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితుడు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ను ఆశ్రయించారు.  ఈ వ్యవహారంపై కమిషనర్‌ పూర్తిస్థాయిలో విచారణ జరపగా పోలీసులపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో వారిద్దరిని సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ.. పర్యవేక్షణ లోపం కారణంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు మెమో జారీ చేశారు.

స్టేషన్ బెయిల్ కోసం నిందితుల నుంచి లంచాలు తీసుకొని గతంలో కొంత మంది పోలీసులు సస్పెన్షన్ కి గురయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు చంద్రయాణగుట్ట పీఎస్ ఎస్సై వెంకటేష్, మంగళ్ హాట్ ఎస్సై వెంకట్ కిషన్ లను సస్పెండ్ చేశారు సీపీ అంజనీ కుమార్. స్టేషన్ కి వచ్చేవారి పట్ల సక్రమంగా ప్రవర్తించకపోవడంతో పాటు కంప్లెంట్స్ దగ్గర లంచం అడిగిన కానిస్టేబుల్స్ ని కూడా గతంలో సస్పెండ్ చేశారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్...