
మూడో వన్డేలో ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ
3–0తో సిరీస్ క్లీన్‌స్వీప్
గిల్ సెంచరీ, రాణించిన ఇషాన్
పోరాడి ఓడిన జింబాబ్వే
హరారే: ఊహించినట్టే చిన్నజట్టు జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను ఇండియా 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. కానీ, తొలి మ్యాచ్‌లో తేలిపోయి.. రెండో పోరులో పోటీ ఇచ్చిన ఆతిథ్య జట్టు నుంచి ఆఖరాటలో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. పెద్ద టార్గెట్ ఛేజింగ్‌లో ఓ దశలో169/7 ఓటమి అంచుల్లో నిలిచిన జింబాబ్వే.. సికందర్ రజా (95 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 115) అద్భుత సెంచరీతో చెలరేగడంతో 273/7తో రేసులోకి వచ్చింది. ఇండియాను ఓడించినంత పని చేసింది. కానీ, ఉత్కంఠ క్షణాల్లో.. ఒత్తిడిని జయించిన బౌలర్లు జట్టుకు ఓటమి తప్పించారు. శుభ్‌మన్ గిల్ (97 బాల్స్‌లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో130) కెరీర్‌లో తొలి సెంచరీకి తోడు బౌలర్లు సమష్టిగా రాణించడంతో సోమవారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 13 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. తొలుత ఇండియా 50 ఓవర్లలో 289/8 స్కోరు చేసింది. గిల్‌తో పాటు ఇషాన్ కిషన్ (50) ఫిఫ్టీతో మెప్పించగా.. శిఖర్ ధవన్ (40) , కెప్టెన్ కేఎల్ రాహుల్ (30) ఫర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ (5/54) ఐదు వికెట్లతో చెలరేగాడు. ఛేజింగ్‌లో ఆతిథ్య జట్టు 49.3 ఓవర్లలో 276 రన్స్‌కు ఆలౌటైంది. అవేశ్ (3/66), అక్షర్ (2/30), కుల్దీప్ (2/38), దీపక్ చహర్ (2/75) రాణించారు. గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి.
సికందర్ ఒక్కడే
టార్గెట్ ఛేజింగ్‌లో జింబాబ్వే మూడో ఓవర్లోనే ఓపెనర్ కయా (6) వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్ తర్వాత కాలు నొప్పితో మరో ఓపెనర్ కైటనో (13) రిటైర్ అవగా.. వన్‌డౌన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ (45).. టోనీ మున్యోంగ (15)తో 41 రన్స్ జోడించాడు. అయితే, ఏడు బాల్స్ తేడాతో ఈ ఇద్దరినీ ఔట్ చేసిన ఇండియా బౌలర్లు హోమ్‌టీమ్‌ను దెబ్బకొట్టారు. సికందర్ రజా పోరాడుతున్నా.. మరో ఎండ్‌లో కెప్టెన్ చకబ్వ (16), తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన కైటనో, బర్ల్ (8), జాంగ్వే (14) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 36 ఓవర్లకు 169/7తో నిలిచిన జింబాబ్వే 200లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, ఆశలే లేని పరిస్థితిలో రజా అనూహ్యంగా చెలరేగాడు. బ్రాడ్ ఎవాన్స్ (28) సహకారంతో ఫోర్లు, సిక్సర్లు బాది స్కోరు 250 దాటించాడు. అవేశ్ వేసిన 48వ ఓవర్లో ఎలాన్స్ ఔటైనా16 రన్స్ వచ్చాయి. చివరి 12 బాల్స్‌లో 17 రన్స్‌గా అవసరం అవగారజా ఉండటంతో జింబాబ్వే గెలిచేలా కనిపించింది. కానీ, ఠాకూర్ వేసిన 49వ ఓవర్లో లాంగాన్ దగ్గర గిల్ ముందుకు డైవ్ చేస్తూ పట్టిన అద్భుత క్యాచ్‌కు రజా ఔటవడంతో మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చింది. లాస్ట్ ఓవర్లో విక్టర్‌ను బౌల్డ్ చేసిన అవేశ్ మ్యాచ్ ముగించాడు.