వీడియో: స్పీచ్ అదిపోయింది.. కోహ్లీపై  ప్రశంసలు కురిపించిన ఫీల్డింగ్ కోచ్

వీడియో: స్పీచ్ అదిపోయింది.. కోహ్లీపై  ప్రశంసలు కురిపించిన ఫీల్డింగ్ కోచ్

వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలో భారత జట్టులో బెస్ట్ ఫీల్డర్ మెడల్ అవార్డు అంటూ ఒక విషయం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రమాణాలతో పాటు సహచరుల్లో ఉత్సాహం నింపే ఆటగాడిని ఎంపిక చేసి.. డ్రెస్సింగ్ రూమ్‌లో మెడల్ అందించేవారు. ఈ ఆనవాయితీ వరల్డ్ కప్ ముగిశాక కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆఫ్గనిస్తాన్‌పై సిరీస్ విజయం అనంతరం ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఉత్తమ ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీని ప్రకటించారు. కాకపోతే ఆ అవార్డు ప్రకటించే సమయంలో ఆయన చెప్పిన మాటలు వింటే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. 

విరాట్ కోహ్లీ నిబద్ధత, అంకితభావం యువ తరాలకు స్ఫూర్తి అన్న భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్.. అతనితో కలిసి ఆడటం సహచర ఆటగాళ్లకు సదవకాశమని కొనియాడారు. అవకాశమొచ్చిన ప్రతీసారి మెప్పిస్తూ కోహ్లీ తానేంటో నిరూపిస్తున్నాడని కోచ్ కితాబిచ్చాడు. 

"నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ 2 పతకాలు సాధించాడు. అంతకుముందు  మేం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నప్పుడు అతను నాతో ఒక మాట చెప్పాడు. నేను స్లిప్‌లో నిలబడాలని అనుకోవడం లేదు. కష్టమైన స్థానాల్లో ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నా అని.. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అందుకే అతను వరల్డ్ కప్ లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు.. ప్రూవ్ చేసుకున్నాడు.. అదీ జట్టు కోసం శ్రమించాలనే అతని తపన. అలా అని తన పని తాను చేసుకుపొవట్లేడు.. జట్టులోని సహచర ఆటగాళ్లలోనూ విశ్వాసాన్ని నింపుతున్నాడు.. కొత్తగా జట్టులోకి వచ్చే కుర్రాళ్లు కూడా అతన్ని అనుసరించండి.. అందులో సగం కష్టపడినా జట్టులో అనేక మార్పులు కనిపిస్తాయి.." అని భారత ఫీల్డింగ్ కోచ్ డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడారు. 

అదే సమయంలో యువ ఫినిషర్ రింకూ సింగ్ పై కూడా భారత ఫీల్డింగ్ కోచ్ ప్రశంసలు కురిపించారు. బ్యాటింగ్, ఫీల్డింగ్ రెండు విభాగాల్లోనూ రింకూ ఓ అద్భుతమని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

కాగా, ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.