- ప్రభుత్వ పథకాలకు ప్రజల మద్దతే విజయానికి కారణం: మంత్రి వివేక్ వెంకటస్వామి
- కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు
- చెన్నూరులో కాంగ్రెస్ సంబురాలు
కోల్బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతు ఇవ్వడంవల్లనే రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా మున్సిపాలిటీలు గెలిచామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో జరిగిన సంబురాల్లో ఆయన పాల్గొన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ పొత్తు కారణంగా బీఆర్ఎస్ గెలవగలిగిందన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోనూ అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించడంతో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో మంత్రి సమక్షంలో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచి, రంగులు చల్లుకున్నారు.
