పెద్దపల్లిలో ఎయిమ్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదు..ఎంపీ వంశీకృష్ణకు నడ్డా సమాధానం

పెద్దపల్లిలో ఎయిమ్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదు..ఎంపీ వంశీకృష్ణకు నడ్డా సమాధానం
  •     వంశీకృష్ణకు నడ్డా సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని తమకు అభ్యర్థనలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, పెద్దపల్లిలో ఎయిమ్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని పేర్కొంది. శుక్రవారం లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన  కింద దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్ లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పెద్దపల్లిలోని మెడికల్ కాలేజీ/జిల్లా ఆసుపత్రిలో ఒక ‘క్రిటికల్ కేర్ బ్లాక్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపామని వెల్లడించారు. అలాగే, నిమ్స్ (హైదరాబాద్), రిమ్స్ (ఆదిలాబాద్), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్) లో సూపర్ స్పెషాలిటీ బ్లాకుల నిర్మాణం ద్వారా వైద్యసేవలను బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు.