IND vs AUS: తుస్సుమన్న కంగారూలు.. తొలి వ‌న్డేలో భారత్ సునాయాస విజయం

IND vs AUS: తుస్సుమన్న కంగారూలు.. తొలి వ‌న్డేలో భారత్ సునాయాస విజయం

ప్రపంచ కప్ చివరి సన్నద్ధతను భారత్ ఘనంగా ఆరంభించింది. శుక్రవారం పటిష్ట ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు అద్భుత‌ విజ‌యాన్ని అందుకుంది. మొదటి నుంచి చివరి వరకూ చప్పగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులకు ఎలాంటి మజా అందించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 276 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని భారత ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ ఛేదించారు.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్(52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లిస్‌(45), స్టీవ్‌ స్మిత్(41), మార్న‌స్ ల‌బూషేన్(39) పర్వాలేదనిపించారు. భారత పేస‌ర్ ష‌మీ ఐదు వికెట్లు తీసి.. ఆసీస్ ను దెబ్బకొట్టాడు.

అనంతరం 277 పరుగుల లక్ష్యాన్ని భారత్.. మరో 8 బంతులు మిగిలివుండగానే చేధించింది. భార‌త‌ ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(74), రుతురాజ్ గైక్వాడ్(71) ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీల‌తో  చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 142 ప‌రుగులు జోడించారు. అనంతరం వెనువెంటనే భారత్ మూడు వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ రాహుల్(56 నాటౌట్), సూర్య‌కుమార్ యాద‌వ్(50) జోడి నింపాదిగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు.