IND vs ENG: అశ్విన్‌ మైండ్‌గేమ్‌.. గొడవకు దిగిన అండర్సన్‌.. వీడియో

IND vs ENG: అశ్విన్‌ మైండ్‌గేమ్‌.. గొడవకు దిగిన అండర్సన్‌.. వీడియో

విశాఖ చల్లని వాతావరణం భారత్- ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య వాడీవేడీ చర్చకు దారితీసింది. అసలే ఫ్లాట్ పిచ్‌పై వికెట్లు పడక ఇంగ్లీష్ బౌలర్లు ఆపసోపాలు పడుతుంటే.. దానిపై కారం చల్లాడు.. మన రవిచంద్రన్ అశ్విన్. మైండ్ గేమ్‌ ఆడుతూ.. వారి ఏకాగ్రతను దెబ్బతీశాడు. అందుకు ప్రతిగా ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్.. అశ్విన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైజాగ్‌ వేదికగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు 2వ రోజు ఆటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏం జరిగిందంటే..?

భారత్ తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌  95వ ఓవర్‌లో జేమ్స్‌ ఆండర్సన్‌ తన డెలివరీని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న అశ్విన్‌ చేయి చాచాడు. ఇక్కడ అశ్విన్‌.. అండర్సన్‌ను రెచ్చగొట్టాలని ఉద్దేశపూర్వకంగా చేశాడు అని కూడా చెప్పలేం. తన టీషర్ట్‌ను భుజం పైకి జరుపుకునే ప్రక్రియలో అశ్విన్‌ అలా చేశాడు. దాంతో రనప్‌లో ఉన్న అండర్సన్ తన దృష్టిని కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా బంతిని వేయకుండా రిటర్న్‌ అయ్యాడు. 

అలా అండర్సన్‌ రిటర్న్‌ వెళ్తూ అశ్విన్‌ వైపు కోపంగా చూసి ఏదో గునుక్కుంటూ వెళ్లిపోయాడు. ఏకాగ్రతను దెబ్బకొట్టిన అశ్విన్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్‌‌తో కూడా ఈ విషయంపై చర్చించాడు. అశ్విన్‌ తన ఏకాగ్రతను దెబ్బతీశాడని వివరించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చివరలో 37 బంతులాడిన అశ్విన్‌.. 4 బౌండరీల సాయంతో 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది.