IND vs ENG 4th Test: రూట్ సెంచరీ.. తొలిరోజు ఇంగ్లాండ్‌దే

IND vs ENG 4th Test: రూట్ సెంచరీ.. తొలిరోజు ఇంగ్లాండ్‌దే

రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ హోరాహోరీగా సాగుతోంది. తొలిరోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి  302 పరుగులు చేసింది. అరంగేట్రం పేస‌ర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెర‌గ‌డంతో తొలి సెష‌న్‌లోనే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను జో రూట్(106*; 226 బంతుల్లో 9 ఫోర్లు) ఆదుకున్నాడు. పరుగు.. పరుగు జోడిస్తూ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ తొలిరోజు పైచేయి సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టిన బెన్ స్టోక్స్ సేన‌ మొద‌టి సెష‌న్‌లోనే త‌డ‌బ‌డింది. అరంగేట్రం పేస‌ర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెర‌గ‌డంతో తొలి సెష‌న్‌లోనే ఐదు వికెట్లు కోల్పోయింది. జాక్ క్రాలే(42), బెన్ డ‌కెట్(11), ఓలీ పోప్(0), బెయిర్ స్టో(38), బెన్ స్టోక్స్(3)లు స్వ‌ల్ప స్కోర్‌కే పెవిలియ‌న్ చేరారు. ఆ సమయంలో రూట్- బెన్ ఫోక్స్(46; 126 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) జోడి ఆదుకున్నారు.వీరిద్దరూ ప‌ట్టుద‌ల‌గా ఆడ‌డంతో లంచ్ త‌ర్వాత సెష‌న్‌లో ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సిరాజ్ విడగొట్టాడు. దీంతో  113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

అనంతరం టెయిలెండర్ల సాయంతో రూట్ విలువైన భాగస్వామ్యాలు నిర్మిస్తూనే వచ్చాడు. టామ్ హార్ట్లీ(13) సాయంతో 20 పరుగులు, ఓలీ రాబిన్సన్(31 నాటౌట్) సాయంతో 57 పరుగులు జోడించాడు. దీంతో ఇంగ్లాండ్ కష్టాల నుంచి గట్టెక్కడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిరోజు భారత బౌలర్లలో ఆకాష్ దీప్ 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 2, అశ్విన్, జడేజా ద్వయం చెరో వికెట్ తీసుకున్నారు.