భారత బౌలర్లను ఆటాడుకున్న ఐర్లాండ్ పేసర్.. కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ

భారత బౌలర్లను ఆటాడుకున్న ఐర్లాండ్ పేసర్.. కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ

ఇండియాతో జరుగుతోన్న తొలి టీ20లో ఐర్లాండ్ జట్టు 140 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నిర్ధేశించింది. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఐరిష్‌ను.. ఆ జట్టు బౌలర్ బారీ మెక్‌కార్తీ ఆదుకున్నాడు. బ్యాటర్లంతా విఫలమైన చోట హాఫ్ సెంచరీతో మెరిశాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ కు శుభారంభం లభించలేదు. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి ఐరిష్ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అనంతరం ప్రసిద్ క్రిష్ణ, రవి బిష్ణోయ్ కూడా చెలరేగడంతో స్టిర్లింగ్ సేన 31 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కర్టిస్ కాంఫర్(39; 33 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), బారీ మెక్‌కార్తీ(51; 33 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్స్ లు) జట్టును ఆదుకున్నారు. 

మొదట నిలకడగా ఆడిన మెక్‌కార్తీ.. అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఏకంగా 222 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఐరిష్ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. మెక్‌కార్తీకి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ క్రిష్ణ, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. అర్షదీప్ సింగ్ ఒక తీసుకున్నారు.