IND vs IRE: తొలి టీ20లో టీమిండియా విజయం.. కెప్టెన్‌గా బుమ్రా అరుదైన ఘనత

IND vs IRE: తొలి టీ20లో టీమిండియా విజయం.. కెప్టెన్‌గా బుమ్రా అరుదైన ఘనత

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత్.. 47/2 (6.5 ఓవర్లు) పరుగుల వద్ద ఉన్నప్పుడు వద్ద వర్షం అంతరాయం కలిగించింది. ఆపై వరణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం అప్పటికే 2 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌ను విజేతగా ప్రకటించారు. 

మొదట బ్యాటింగ్ చేసిన ఐరిష్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 31 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ స్టిర్లింగ్ సేనను కర్టిస్ కాంఫర్(39; 33 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), బారీ మెక్‌కార్తీ(51; 33 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్స్ లు) ఆదుకున్నారు. మొదట నిలకడగా ఆడిన మెక్‌కార్తీ.. అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఏకంగా 222 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఐర్లాండ్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ క్రిష్ణ, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. అర్షదీప్ సింగ్ ఒక తీసుకున్నారు. 

అనంతరం 140 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్  47/2 పరుగుల వద్ద ఉన్నప్పుడు వరుణుడు అడ్డుపడ్డాడు. ఆపై వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని భావించిన అంపైర్లు.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్ ను విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా టీ20ల్లో తొలి మ్యాచ్‌‍లోనే విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం(ఆగష్టు 20) ఇదే వేదికపై జరగనుంది.