ఐరిష్ బౌలర్లపై జాలి చూపని భారత బ్యాటర్లు.. డబ్లిన్‌లో సిక్సర్ల వర్షం

ఐరిష్ బౌలర్లపై జాలి చూపని భారత బ్యాటర్లు.. డబ్లిన్‌లో సిక్సర్ల వర్షం

ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత యువ బ్యాటర్లు వీరవిహారం చేశారు. కరుణ, జాలి, దయ అన్నది లేకుండా ఐరిష్ బౌలర్లపై నిర్ధాక్షిణంగా విరుచుకుపడ్డారు. మొదట రుతురాజ్ గైక్వాడ్(58), సంజు సాంసన్(40) మెరుపులు మెరుపిస్తే.. ఆఖరిలో రింకూ సింగ్ (38), శివమ్ దూబే (22) జోడి సిక్సర్లతో హోరెత్తించారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇండియా.. ఐరిష్ బ్యాటర్ల ముంగిట భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలుత రుతురాజ్‌ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకంతో రాణించగా.. సంజూ శాంసన్ (40; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడాడు. 

వీరిద్దరూ వెనుదిరగాక స్కోర్ బోర్డు కాసేపు నెమ్మదించినా.. ఆఖరిలో జెడ్ స్పీడ్‌తో దూసుకుపోయింది. రింకూ సింగ్ (38; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా, శివమ్ దూబే (22 నాటౌట్; 16 బంతుల్లో 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు పిండుకున్నారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మెకర్థీ 2 వికెట్లు తీసుకోగా.. మార్క్‌ అడైర్‌, క్రెయిగ్ యంగ్, బెంజమిన్‌ వైట్ తలో వికెట్ పడగొట్టారు.