IND vs NZ: ఆదుకున్న కోహ్లీ- జడేజా.. ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం

IND vs NZ: ఆదుకున్న కోహ్లీ- జడేజా.. ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం

ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. రెండూ ఓటమి ఎరుగని జట్లు కావడంతో ఈ మ్యాచ్ ఆఖరి వరకూ నువ్వా.. నేనా అన్నట్లు సాగింది. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(95) మరోసారి రాణించాడు. 191 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర జడేజా(39) సహకారంతో విజయతీరాలకు చేర్చాడు. ఈ  మ్యాచ్‌లో కివీస్‍ నిర్ధేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని.. భారత బ్యాటర్లు మరో 12 బంతులు మిగిలివుండగానే చేధించారు.

రోహిత్ - గిల్ దూకుడు

274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అది నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ(46), శుభ్‌మాన్‌ గిల్‌(26) జోడి తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆపై వీరిద్దరూ వెంటవెంటనే ఔట్ అవ్వడంతో భారత్‌కు కష్టాలు మొదలయ్యాయి. శ్రేయాస్ అయ్యర్(33), కేఎల్ రాహుల్(27) కుదురుకున్నట్లే కనిపించిన కీలక సమయాల్లో వికెట్లు పారేసుకున్నారు. 

జట్టును కష్టాల్లోకి నెట్టిన సూర్య

రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య(2) ఎప్పటిలానే జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. అనంతరం కోహ్లీ మరోసారి తన అనుభవాన్ని చూపాడు. ఆచి ఆతూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. చివరిలో సెంచరీ కోసం ప్రయత్నించి అతడు వెనుదిరిగినా.. షమీ(1) -జడేజా(39) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

అంతకుముందు న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 273 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (130) సెంచరీతో చెలరేగగా.. రచిన్ రవీంద్ర (75) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.