ఎంతకు తెగించారు : ఇండియా - పాక్ మ్యాచ్ టికెట్ల కొనుగోలు పేరుతో కిడ్నాప్

ఎంతకు తెగించారు : ఇండియా - పాక్ మ్యాచ్ టికెట్ల కొనుగోలు పేరుతో కిడ్నాప్

కిడ్నాపర్లు రోజు రోజుకు బరితెగిస్తున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో కిడ్నాప్లకు పాల్పడుతూ..అందిన కాడికి దోచేస్తున్నారు. తాజాగా కొందరు కిడ్నాపర్లు..భారత్ పాకిస్తాన్ టికెట్ల కొనుగోలు పేరుతో కిడ్నాప్కు యత్నించారు. టికెట్లు కొనుగోలు చేస్తామని చెప్పి..ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అతన్ని  విడిచిపెట్టేందుకు  రూ. 2.50 లక్షలు డిమాండ్ చేశారు. కానీ బాధితుడి దగ్గర అంత డబ్బు లేకపోవడంతో..చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా..ఖాతాలో ఉన్న రూ. 24 వేలు డ్రా చేసుకుని వదిలిపెట్టారు. ఈ ఘటన అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. 


గుజరాత్ రాష్ట్రం ధోల్కాకు చెందిన వివేక్ వాలా బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతను  బుక్ మై షోలో వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. అయితే వివేక్ వాలా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు విక్రయిస్తున్నాడని వాలా స్నేహితుడు హర్షబ్ బరోట్ నీలేష్ అనే వ్యక్తికి చెప్పాడు. దీంతో మ్యాచ్ టికెట్లు కోసం వాలాను నీలేష్ సంప్రదించాడు. దీంతో నీలేష్ కు భారత్ పాకిస్తాన్ టికెట్లు ఇస్తానని వాలా హామీ ఇచ్చాడు. 

భారత్ పాక్ మ్యాచ్ టికెట్ల కోసం ఉన్మేష్ అమీన్ అనే వ్యక్తిని వాలా దగ్గరకు నీలేష్ పంపాడు. దీంతో నీలేష్ కు ఇచ్చిన హామీ మేరకు వివేక్ వాలా ఉన్మేష్ కు టికెట్లు ఇస్తానన్నాడు. అయితే ఉన్మేష్ తనకు 66 టికెట్లు కావడాలని డిమాండ్ చేశాడు. ఆ టికెట్లను ఇస్తానని..ఈ 66 టికెట్లు నీలేష్ సోదరుడికి ఇస్కాన్ సర్కిల్ లో  అందజేస్తానని చెప్పాడు. టికెట్ల కోసం ఇస్కాన్ సర్కిల్ కు చేరుకోవాలని వాలా  ఉన్మేష్ అమీన్ కు సూచించాడు. నీలేష్ సోదరుడి కోసం వాలా, బరోట్ వెయిట్ చేస్తుండగా..సంఘటనా స్థలానికి ఉన్మేష్ అమీన్ మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వివేక్ వాలాను, అతని స్నేహితుడు బరోట్ లను బలవంతంగా కారులో ఎక్కించుకుని వస్త్రాపూర్ రైల్వే క్రాసింగ్ దగ్గరకు తీసుకెళ్లారు. వాలాతో పాటు అతని స్నేహితుడు బరోట్ లను విడిచిపెట్టాలంటే  ఒక్కోక్కరికి రూ. 2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.  అయితే వీరి దగ్గర అంత డబ్బు లేదని గుర్తించిన నిందితులు..వాలా డెబిట్ కార్డును బలవంతంగా తీసుకుని..అతని ఖాతా నుంచి రూ. 24 వేలు డ్రా చేసుకున్నారు. అనంతరం వీరిద్దరిని అక్టోబర్  9వ తేదీన రాత్రంతా కారులోనే బంధించారు. అనంతరం విడిచిపెట్టారు. 

కిడ్నాపర్ల నుంచి బయటపడ్డ వివేక్ వాలా..అతని స్నేహితుడు హర్ష్ బరోట్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.