IND vs SA 1st Test: చేతబడి చేశావా ఏంటి..!: కోహ్లీ అలా చేశాడు.. ఇలా వికెట్లు పడ్డాయి

IND vs SA 1st Test: చేతబడి చేశావా ఏంటి..!: కోహ్లీ అలా చేశాడు.. ఇలా వికెట్లు పడ్డాయి

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రెండో రోజు ఆటలో నిలకడగా ఆడుతున్న సఫారీ బ్యాటర్లను విరాట్ కోహ్లీ తన మ్యాజిక్‌తో పెవిలియన్ చేర్చాడు. 93 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన డీన్ ఎల్గర్, టోని డీ జోర్జీ జోడీని బుమ్రా సాయంతో విడదీశాడు. అయితే అతడు చేసింది చేతబడా..? లేదా మ్యాజిక్కా..! అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

ఇంతకీ ఏం చేశాడంటే..?

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 245 పరుగుల వద్ద ఆలౌట్ కాగా, సఫారీ జట్టు ఇన్నింగ్స్ ను ధీటుగా ఆరంభించింది. ఆరంభంలో ఎయిడెన్‌ మార్క్‌రమ్‌(5) వికెట్‌ కోల్పోయినా.. డీన్ ఎల్గర్(131 నాటౌట్), టోనీ డి జోర్జి (28) జోడి భారత బౌలర్లను విసిగించారు. ఏకంగా రెండో వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, వీరిద్దరిని విడతీసేందుకు కోహ్లీ ఒక మ్యాజిక్ చేయగా.. రెండు బంతుల వ్యవధిలోనే వికెట్ల పడ్డాయి.  

డీ జోర్జీ ఔటవ్వకు ముందు కోహ్లీ వికెట్ల వద్దకు వెళ్లి ఏదో మంత్రం వేశాడు. అలాగే, అతడు ఔటవ్వడానికి సరిగ్గా రెండు బంతుల ముందు బెయిల్స్ మార్చాడు. అటుది ఇటు.. ఇటుది అటు చేంజ్ చేశాడు. దాంతో లక్ ఒక్కసారిగా టీమిండియా వైపు మళ్లింది. ఇది జరిగిన రెండు బంతుల అనంతరం క్రీజులో పాతుకుపోయిన డీన్ ఎల్గర్, డీ జోర్జీ జోడీని జస్‌ప్రీత్ బుమ్రా విడదీశాడు. ఆపై బుమ్రా తన మరుసటి ఓవర్లోనే కీగన్ పీటర్సన్(2) కూడా బౌల్డ్ చేశాడు. దీంతో సఫారీ జట్టు 9 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కోహ్లీ చేసిన పని నెట్టింట వైరల్‌ అవుతోంది.

స్టువర్ట్ బ్రాడ్

ఈ ఏడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అచ్చం ఇలానే చేసి ఫలితం రాబట్టాడు. ఓ మ్యాచ్‌లో స్టంప్స్‌ మార్చి ఆసీస్ బ్యాటర్ లాబుచానే వికెట్ తీశాడు. ఇప్పుడు కోహ్లీ ఆ మంత్రాన్నే ఉపయోగించి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.