IND vs SA 2nd Test: ఒకే రోజు 23 వికెట్లు.. ఉత్కంఠభరితంగా మారిన రెండో టెస్ట్

IND vs SA 2nd Test: ఒకే రోజు 23 వికెట్లు.. ఉత్కంఠభరితంగా మారిన రెండో టెస్ట్

కేప్ టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ హోరాహోరీగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లలో ఇరు జట్లు స్వల్ప స్కోరుకే ఆలౌట్ అవ్వడంతో మ్యాచ్ నీదా నాధా అన్నట్లుగా మారింది. పేస్ కు అనుకూలించిన పిచ్ పై ఇరుజట్ల బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఒక రోజు 23 వికెట్లు నేలరాలాయి. తొలి రోజే ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ లు ముగియటం కూడా ఒక రికార్డే.

మొదట మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 55పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా 153 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 98 పరుగుల ఆధిక్యం సంపాదించింది. 

అనంతరం రెండో ఇన్నింగ్స్  ఆరంభించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. కెరీర్ లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న సఫారీ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ 12 పరుగుల వద్ద ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అనంతరం కాసేపటికే జోర్జి(1)ని ముఖేష్ ఔట్ చేయగా.. స్టబ్స్(1)ని బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా 36 పరుగుల వెనుకంజలో ఉంది. బెడింగ్హామ్ (7 నాటౌట్), మారమ్ (36 నాటౌట్) క్రీజులో ఉన్నారు.