SA vs IND 2nd Test: మిషన్ రబాడా.. కగిసో టార్గెట్‌గా రోహిత్ శర్మ ప్రాక్టీస్

SA vs IND 2nd Test: మిషన్ రబాడా.. కగిసో టార్గెట్‌గా రోహిత్ శర్మ ప్రాక్టీస్

సఫారీ పర్యటనలో తొలి టెస్టులో ఓడిన టీమిండియా, రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా సమాయత్తమవుతోంది. జనవరి 3 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో విజయం సాధించి.. సిరీస్ సమం చేయాలనే లక్ష్యంతో ఆటగాళ్లంతా నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ముఖ్యంగా భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సఫారీ పేసర్ కగిసో రబాడా టార్గెట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు.

తొలి టెస్టులో రోహిత్ శర్మ చేసిన పరుగులు.. 5. తొలి ఇన్నింగ్స్‌లో 14 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 5 పరుగుల వద్ద రబాడా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 8 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈసారి ఏకంగా రబాడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కగిసో వేస్తున్నపేసీ బౌన్సీ బంతులపై రోహిత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ముకేశ్‌ కుమార్‌ చేత బౌన్సర్లు వేపించుకొని ప్రాక్టీస్‌ చేశాడు. విరామం అనేది లేకుండా 45 నిమిషాలసేపు పేసర్లతోనే బౌలింగ్‌ వేపించుకున్నాడు. 

4 నుంచి 6 మీటర్ల లెంగ్త్‌లో బంతి లోపలికి వచ్చేలా ముకేశ్‍ కుమార్.. ఇన్‌స్వింగర్లు సంధించాడు. రబాడాలా లైన్ అండ్ లెంగ్త్‌, బౌన్సర్లతో బాగానే ఇబ్బంది పెట్టాడు. మరోవైపు, తొలి టెస్టులో విఫలమైన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముకేశ్ రెండో టెస్టులో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక వెన్ను నొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా ప్రాక్టీస్‌లో తలమునకలై ఉన్నాడు.

భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్‌, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.