IND vs SA 2nd Test: సిరాజ్ మాయ.. చెత్త రికార్డు మూటగట్టుకున్న దక్షిణాఫ్రికా

IND vs SA 2nd Test: సిరాజ్ మాయ.. చెత్త రికార్డు మూటగట్టుకున్న దక్షిణాఫ్రికా

కేప్‌టౌన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 55 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌కు సఫారీ బ్యాటర్లు దాసోహమైపోయారు. బంతి.. బ్యాట్‌ను తాకితే ఎక్కడ ఔట్ అవుతామో అన్నట్లుగా భయపడిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 6 వికెట్లు తీసిన సిరాజ్.. ఓ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రోజు ఆటలో లంచ్ విరామంలోపు 5 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో మణిందర్ సింగ్ ఈ ఘనత సాధించాడు. 1987లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మణిందర్ సింగ్ 7 వికెట్లు పడగొట్టాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్‌ అవ్వడంతో.. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు మూటగట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిషేధం ఎత్తివేశాక ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌కు ముందు వారి అత్యల్ప స్కోరు 73గా ఉంది. అదే నిషేధం ఎత్తివేయక ముందు చూస్తే వారి అత్యల్ప స్కోరు 30 పరుగులు. 1896లో గబేరా వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో సఫారీలు 30 పరుగులకే ఆలౌట్ అయ్యారు.  

నిషేధానికి ముందు దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోర్లు

  • 30 పరుగులు: ఇంగ్లండ్‌పై (1896)
  • 30 పరుగులు: ఇంగ్లండ్‌పై (1924)
  • 35 పరుగులు: ఇంగ్లండ్‌పై (1899)
  • 36 పరుగులు: ఆసీస్‌పై (1932)
  • 43 పరుగులు: ఇంగ్లండ్‌పై (1889)

నిషేధం తరువాత దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోర్లు

  • 55 పరుగులు: భారత్‌పై (2024)
  • 73 పరుగులు: శ్రీలంకపై (2018)
  • 79 పరుగులు: భారత్‌పై (2015)
  • 83 పరుగులు: ఇంగ్లండ్‌పై (2016)
  • 84 పరుగులు: భారత్‌పై (2006) 

నిషేధం ఎందుకు..?  

1971లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు.. ఆస్ట్రేలియాలో పర్యటించాలి. అందుకోసం ఆ దేశ క్రికెట్ బోర్డు.. నల్లజాతి ఆటగాళ్ళు డిక్ అబేద్, ఓవెన్ విలియమ్స్ జట్టులో భాగమని ప్రకటన  చేసింది. అయితే, ఈ ప్రకటనను తెల్ల జాతీయులైన అబేద్, విలియమ్స్ తిరస్కరించారు. అనంతరం అదే ఏడాది ఇంగ్లిషు వ్యకి అయిన కోలిన్ కౌడ్రీ జాతిపరంగా మిశ్రిత జట్టును దక్షిణాఫ్రికా పర్యటనకు తీసుకువెళ్ళి దక్షిణాఫ్రికా నల్లజాతి జట్టుతోనూ, తెల్లజాతి జట్టుతోనూ వేర్వేరుగా క్రికెట్ ఆడాలన్న ప్రయత్నం చేశాడు. అలా మొదలైన వర్ణ వివక్ష కొన్నేళ్ల పాటు సాగింది. ఇది నొప్పని ఐసీసీ.. దక్షిణాఫ్రికా జట్టుపై రెండు దశాబ్దాల పాటు నిషేధం విధించింది. అనంతరం 1992లో నిషేధం ఎత్తివేశాక ఆ జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అడుగుపెట్టింది.