IND vs SA 2nd Test: సిరాజ్ అన్‌స్టాపబుల్.. 55 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్ 

IND vs SA 2nd Test: సిరాజ్ అన్‌స్టాపబుల్.. 55 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్ 

భారత పేసర్, హైదరాబాదీ కుర్రాడు మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు న్యూలాండ్స్(కేప్ టౌన్) స్టేడియం దద్దరిల్లిపోయింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో సిరాజ్ అద్భుత గణాంకాలు నమోదుచేశాడు. పేసీ పిచ్‌లపై నిప్పులు చెరిగే బంతులేస్తూ సఫారీ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఏకంగా 6 వికెట్లతో చెలరేగి సఫారీలను కోలుకోనివ్వకుండా చేశాడు. అతని ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికాను సిరాజ్‌.. నాలుగో ఓవర్లోనే దెబ్బకొట్టాడు. ఐడెన్ మార్క్‌రమ్(2)‌ను పెవిలియన్  చేర్చాడు. ఆపై తన మరుసటి ఓవర్లోనే డీన్‌ ఎల్గర్(4)ను బౌల్డ్‌ చేసి డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. అనంతరం ట్రిస్టన్‌ స్టబ్స్‌(3)ను బుమ్రా ఔట్‌ చేయగా.. కొద్దిసేపటికే టోనీ డిజోర్జి(2)ని సిరాజ్ వెనక్కుపంపాడు. అప్పటికే సఫారీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. 

అనంతరం రెండో స్పెల్‌లో మరోసారి బంతి అందుకున్న సిరాజ్.. సఫారీ ఇన్నింగ్స్‌ను నిలువునా కూల్చాడు. ఒకే ఓవర్లో బెడింగ్‌హామ్‌ (12), మార్కో జాన్‌సెన్ (0)ని ఔట్ చేసి వారిని చావు దెబ్బ కొట్టాడు. ఆపై ముఖేష్ కుమార్.. కేశవ్ మహారాజ్(3), కగిసో రబడ(5)లను బుమ్రా..  బర్గర్(4)ను ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరపడింది.