రెండో టీ20లో ఇండియాకు తప్పని ఓటమి

రెండో టీ20లో ఇండియాకు తప్పని ఓటమి
  • 16 రన్స్‌‌ తేడాతో శ్రీలంక గెలుపు
  • సూర్యకుమార్‌‌ పోరాటం వృథా
  • షనక, మెండిస్​ హాఫ్​ సెంచరీలు

పుణె: భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో అక్షర్‌‌ పటేల్‌‌ (31 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 65), సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (36  బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) అదరగొట్టినా.. ఇండియాకు ఓటమి తప్పలేదు. దీంతో గురువారం జరిగిన రెండో టీ20లో శ్రీలంక 16 రన్స్‌‌ తేడాతో ఇండియాపై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 1–1తో సమం చేసింది. టాస్‌‌ గెలిచి ఇండియా ఫీల్డింగ్‌‌ ఎంచుకోగా, బ్యాటింగ్‌‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 206/6 స్కోరు చేసింది. కెప్టెన్‌‌ డాసున్‌‌ షనక (22 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 నాటౌట్‌‌), కుశాల్‌‌ మెండిస్‌‌ (31 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) హాఫ్‌‌ సెంచరీలతో దంచికొట్టారు. తర్వాత ఇండియా 20 ఓవర్లలో 190/8 స్కోరు మాత్రమే చేసింది. శివమ్‌‌ మావి (15 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26) ఫర్వాలేదనిపించాడు. షనకకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 శనివారం రాజ్‌‌కోట్‌‌లో జరుగుతుంది. 

షనక అదుర్స్‌‌.. 

ఆరంభం నుంచే లంక ఓపెనర్లు నిసాంక (33), కుశాల్‌‌ మెండిస్‌‌.. ఇండియా బౌలర్లను దంచికొట్టారు. రెండో ఓవర్‌‌లోనే19 రన్స్‌‌ రాబట్టారు. థర్డ్‌‌ ఓవర్‌‌లో మెండిస్‌‌ సిక్స్‌‌ కొడితే, శివమ్‌‌ మావి వేసిన నాలుగో ఓవర్‌‌లో 15 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి రెండు ఓవర్లలో 8 రన్సే వచ్చినా.. పవర్‌‌ప్లేలో లంక స్కోరు 55/0కు చేరింది. అక్షర్‌‌ (2/24) వేసిన ఏడో ఓవర్‌‌లో 4, 6 కొట్టిన ఈ జోడీ.. తర్వాతి ఓవర్‌‌లోనూ రిపీట్‌‌ చేసింది. 9వ ఓవర్‌‌లో చహల్‌‌ (1/30) సూపర్‌‌ స్లైడర్‌‌కు మెండిస్‌‌ క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. అంపైర్‌‌ ఔటివ్వకపోవడంతో పాండ్యా రివ్యూకు వెళ్లి సక్సెస్‌‌ అయ్యాడు. తర్వాతి ఓవర్‌‌లో ఉమ్రాన్‌‌ (3/48) తొలి బంతికే భానుక రాజపక్స (2)ను వెనక్కి పంపాడు. దీంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో లంక 89/2 స్కోరు చేసింది. 12, 14వ ఓవర్‌‌లో వరుసగా నిసాంకా, ధనంజయ్‌‌  (3)ను ఔట్‌‌ చేయడంతో లంక స్కోరు 113/4గా మారింది. ఈ దశలో అసలంక (34) నాలుగు సిక్సర్లు బాదాడు. కానీ 16వ ఓవర్‌‌లో ఉమ్రాన్‌‌ వరుస బాల్స్‌‌లో అసలంకతో పాటు వానిందు హసరంగ (0)ను వెనక్కి పంపడంతో స్కోరు 138/6 అయ్యింది. ఇక్కడి నుంచి షనక, కరుణరత్నే (11 నాటౌట్‌‌)  4 ఓవర్లలో 68 రన్స్‌‌ జోడించారు.

అక్షర్‌‌ హడలెత్తించినా..

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఏడు బాల్స్‌‌ తేడాలో ఇషాన్‌‌ కిషన్‌‌ (2), శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (5), డెబ్యూ బ్యాటర్‌‌ రాహుల్‌‌ త్రిపాఠి (5) ఔటయ్యారు. ఐదో ఓవర్​లో హార్దిక్‌‌ (12) కూడా వెనుదిరగడంతో 34 రన్స్‌‌కే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సూర్యతో జతకలిసిన దీపక్‌‌ హుడా (9) నిరాశపర్చాడు. 9వ ఓవర్‌‌లో హసరంగ (1/41)కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. దీంతో పవర్‌‌ప్లేలో 39/4 స్కోరు చేసిన ఇండియా తొలి 10 ఓవర్లలో 64/5 తో నిలిచింది. ఈ టైమ్‌‌లో వచ్చిన అక్షర్‌‌ పటేల్‌‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌‌ ఆడాడు. మొదట ఫోర్లతో కుదురుకున్న అతను 13వ ఓవర్‌‌లో తొలి సిక్సర్‌‌ బాదాడు. తర్వాతి ఓవర్‌‌లో 4 సిక్స్‌‌లతో 26 రన్స్‌‌ రాబట్టాడు. 15వ ఓవర్‌‌లో సూర్య, అక్షర్‌‌.. చెరో సిక్స్‌‌ కొట్టడంతో 15 రన్స్‌‌ వచ్చాయి.  కానీ 16వ ఓవర్‌‌లో సిక్స్‌‌ కొట్టిన సూర్య ఐదో బాల్‌‌కు ఔటయ్యాడు. దీంతో ఆరో వికెట్‌‌కు 91 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇక 24 బాల్స్‌‌లో 58 రన్స్‌‌ చేయాల్సిన దశలో మావి  4, 6, 4, 6 కొట్టడంతో విజయసమీకరణం 12 బాల్స్‌‌లో 33 రన్స్‌‌గా మారింది. చివరి రెండు ఓవర్లలో 16  రన్సే వచ్చాయి.

సంక్షిప్త స్కోర్లు

శ్రీలంక: 20 ఓవర్లలో 206/6 (షనక 56*, కుశాల్‌‌ మెండిస్‌‌ 52, ఉమ్రాన్‌‌ 3/48), ఇండియా: 20 ఓవర్లలో 190/8 (అక్షర్‌‌ పటేల్‌‌ 65, సూర్య 51,  రజిత 2/22).