
న్యూఢిల్లీ: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియా వికెట్ కీపర్- బ్యాటర్ రిషబ్ పంత్ దూరంగా ఉండనున్నాడు. పంత్ తన ఎడమ కాలికి అయిన ఫ్రాక్చర్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంగ్లండ్ టూర్‌లో గాయపడిన అతను ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ సాధించే ప్రయత్నాల్లో ఉన్నాడు. తను పూర్తిగా కోలుకొని ఇండియా టీమ్‌లోకి ఎప్పుడు తిరిగొస్తాడో స్పష్టంగా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి జరిగే విండీస్ సిరీస్‌లో పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ జట్టులోకి రానున్నాడు.
కాగా, ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారం టీమ్‌ను ఎంపిక చేయనుంది. పంత్ గైర్హాజరీలో ఇంగ్లండ్ టూర్‌లో ఆఖరి రెండు టెస్టుల్లో కీపర్‌గా జురెల్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం లక్నోలో ఆస్ట్రేలియా–ఎ టీమ్‌తో సిరీస్‌లోనూ తను కీపింగ్ చేస్తున్నాడు. ఒకవేళ సెలక్టర్లు రెండో వికెట్ కీపర్‌ను ఎంపిక చేయాలని భావిస్తే, ఎన్. జగదీశన్‌కు అవకాశం దక్కొచ్చు. ఈ సిరీస్‌కు సెలక్టర్లు యంగ్ బ్యాటర్లు దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డిని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా–ఎతో తొలి అనధికారిక టెస్టులో పడిక్కల్ భారీ సెంచరీ కొట్టాడు. ఇక, గాయం నుంచి కోలుకున్న నితీశ్ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి.