పంద్రాగస్టు వేడుకలకు స్పెషల్ గెస్ట్​లు.. రైతులు, కార్మికులే

పంద్రాగస్టు వేడుకలకు స్పెషల్ గెస్ట్​లు.. రైతులు, కార్మికులే

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పంద్రాగస్టు సంబురాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్రివిధ దళాలు, ఇతర బలగాలు ఫుల్ డ్రెస్ తో రిహార్సల్స్ నిర్వహించాయి. ఎర్రకోటతో పాటు రాజధాని అంతటా ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రకోట వద్ద పంద్రాగస్టు సంబురాలకు రైతులు, కార్మికులతో సహా 1800 మంది సామాన్యులు స్పెషల్ గెస్ట్ లుగా హాజరుకానున్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం (జన్ భాగీదారీ) ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలకు ఇన్విటేషన్లు పంపారు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న వారిలో పీఎం కిసాన్, పీఎం కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు 50 మంది, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్ పీవో)లకు చెందిన 250మంది ప్రతినిధులు, వైబ్రాంట్ విలేజ్ స్కీంలో ఎంపికైన 400కు పైగా గ్రామాల సర్పంచ్​లు, సెంట్రల్ విస్టా, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణంలో పాల్గొన్న 50 మంది, బార్డర్ రోడ్ల నిర్మాణంలో పాల్గొన్న 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ వర్కర్లు, 50 మంది చొప్పున ప్రైమరీ స్కూల్ టీచర్లు, నర్సులు, మత్స్యకారులు, తదితరులు ఉన్నారు. మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ సారి జెండా ఆవిష్కరణలో ప్రధానికి ఆర్మీ ఆఫీసర్లు మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్ కౌర్ సహాయం చేయనున్నారు.    

ఆన్ లైన్​లో సెల్ఫీ కాంటెస్ట్ 

పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఢిల్లీలో ఆగస్ట్ 15 నుంచి 20 వరకూ మైగవర్నమెంట్ పోర్టల్ లో సెల్ఫీ కాంటెస్ట్​ను నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఇందుకోసం ఢిల్లీలో 12 చోట్ల సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. కాంటెస్ట్ లో పాల్గొనే వాళ్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెల్ఫీ పాయింట్ల వద్ద సెల్ఫీలు తీసుకుని పోర్టల్​లో అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో పాయింట్ నుంచి ఒకరికి చొప్పున12 మంది విజేతలను ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి 
రూ.10 వేల క్యాష్ ప్రైజ్ అందజేస్తారు.   

జెండాతో సెల్ఫీ దిగి పెట్టండి: మోదీ

పంద్రాగస్టు సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా అకౌంట్లకు త్రివర్ణ పతాకాన్ని డీపీ (డిస్ ప్లే పిక్చర్)గా పెట్టుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రధాని తన సోషల్ మీడియా అకౌంట్ల డీపీలను ఆదివారం మార్చి జెండా ఫొటోలను ఉంచారు. అనంతరం ప్రజలంతా కూడా తమ డీపీలు మార్చుకోవాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే జెండాతో సెల్పీలు దిగి హర్ ఘర్ తిరంగా డాట్ కామ్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని పేర్కొన్నారు. ‘‘మన జెండా స్వాతంత్ర్య స్పూర్తిని, జాతీయ సమైక్యతను చాటుతుంది. ప్రతి భారతీయుడికీ త్రివర్ణ పతాకంతో ఎంతో అనుబంధం ఉంది. దేశ అభివృద్ధి కోసం మరింత కష్టపడి పని చేసేలా ఇది మనల్ని ఇన్ స్పైర్ చేస్తుంది. అందుకే ఆగస్ట్ 13 నుంచి 15 వరకూ ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా మూమెంట్ లో భాగస్వాములు కావాలి. జెండాతో ఫొటోలు దిగి హర్ ఘర్ తిరంగా డాట్ కామ్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి” అని ప్రధాని పిలుపునిచ్చారు.   

ఇయ్యాల రాష్ట్రపతి ప్రసంగం 

77వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల ద్వారా, దూరదర్శన్ చానెల్స్ లో ముందుగా హిందీలో, ఆ తర్వాత ఇంగ్లిష్ లో ప్రెసిడెంట్ స్పీచ్ ప్రసారం అవుతుందని రాష్ట్రపతి భవన్ అధికారులు ఆదివారం వెల్లడించారు. హిందీ, ఇంగ్లిష్ స్పీచ్ ల ప్రసారం తర్వాత దూరదర్శన్ రీజినల్ చానెల్స్ లో ఆయా ప్రాంతీయ భాషల్లోనూ రాష్ట్రపతి ప్రసంగం టెలికాస్ట్ అవుతుందని, ఆకాశవాణిలో రాత్రి 9.30 నుంచి ప్రాంతీయ భాషల్లో స్పీచ్ ప్రసారం ఉంటుందని పేర్కొన్నారు.