
- 42 పారామీటర్స్ ఆధారంగా ర్యాంకులు
- 300 పేజీలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కమిటీ
- 242 కులాల విశ్లేషణ.. పాలసీల కోసం సర్కార్‌కు కీలక సూచనలు
- రిపోర్ట్‌పై త్వరలో కేబినెట్లో చర్చించి నిర్ణయం
- సామాజిక న్యాయానికి ఈ నివేదిక తోడ్పడుతుంది: సీఎం రేవంత్
- దేశ భవిష్యత్‌ను మార్చే రిపోర్ట్ ఇది: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ స్థితిగతుల ఆధారంగా ప్రతి కులానికీ కంపోజిట్ బ్యాక్ వర్డ్‌నెస్(సీబీ) ఇండెక్స్ ను జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని స్వతంత్ర నిపుణుల కమిటీ రూపొందించింది. సీబీ ఇండెక్స్ ఆధారంగా భవిష్యత్‌లో ప్రభుత్వ పాలసీలను తయారుచేసేందుకు.. ఇప్పటికే అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో మార్పుచేర్పులు చేసుకునేలా ప్రభుత్వానికి విలువైన సూచనలు, సలహాలను రిపోర్టులో కమిటీ పొందుపరిచినట్లు సమాచారం.
మొత్తం 242 కులాలను కమిటీ విశ్లేషించింది. ప్రతి కులానికీ 42 పారామీటర్స్ ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. కులగణన సర్వే రిపోర్ట్‌పై సమగ్ర అధ్యయనం కోసం, విలువైన సూచనల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో కంచ ఐలయ్య, ప్రవీణ్ చక్రవర్తి, తోరట్ వంటి 11 మంది సభ్యులతో ఈ ఏడాది మార్చి 12న కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన అధ్యయనాన్ని పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేసింది. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో శనివారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై, 300 పేజీల ఈ నివేదిక అందజేసింది. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను అధ్యయనం చేసి, అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా, ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే – 2024 పూర్తి శాస్త్రీయంగా, విశ్వసనీయంగా ఉందని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. తెలంగాణలో పూర్తి చేసిన ఈ సర్వే చారిత్రాత్మకమని, దేశానికి రోల్ మాడల్ గా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
బలహీనవర్గాల అభ్యున్నతికి తోడ్పాటు: సీఎం
రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించిన కులగణన సర్వే కేవలం డేటా కోసం కాదని అది తెలంగాణ మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే చేశామని, ఆ డేటా విశ్లేషణకు స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించామని, వాళ్లిచ్చిన నివేదిక బలహీనవర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం కోసం ఈ నివేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడాలపైనా అధ్యయనం చేసి, అంతరాలకు గల కారణాలను కనుక్కోవాలని నిపుణుల కమిటీకి సీఎం సూచించారు.
దేశ భవిష్యత్‌ను మార్చనుంది: డిప్యూటీ సీఎం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల సర్వే, దాని ఆధారంగా చేసిన విశ్లేషణ నివేదిక దేశ భవిష్యత్‌ను మార్చనుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఇప్పటివరకు సంపద, వనరులు చేరని వర్గాలకు ఈ సర్వే విశ్లేషణ ఆధారంగానే చేరువ అవుతాయని పేర్కొన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం, సమానత్వం, సంపద పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. విలువైన సమయాన్ని కేటాయించి నివేదికను విశ్లేషించిన మేధావులకు ధన్యవాదాలు తెలిపారు. వారి సూచనలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొన్నం, లక్ష్మణ్, సీతక్క, అధికారులు పాల్గొన్నారు.
సీబీ ఇండెక్స్‌తో కచ్చితత్వం
- ఒక ప్రాంతం లేదా సమాజం ఎంతవరకు వెనుక బడి ఉందో అంచనా వేయడానికి కాంపొజిట్ బ్యాక్ వర్డ్‌నెస్ (సీబీ) ఇండెక్స్ పద్ధతిని వాడు తారు. కులగణన సర్వే నివేదికలో ప్రతి కులం ఏ స్థితిలో ఉన్నదనేది ఆర్థిక స్థితిగతులనే కాకుండా.. సామాజిక, రాజకీయ, భౌగోళికంతో పాటు 42 అంశాలను పరిగణనలోకి తీసుకుని కమిటీ విశ్లే షించింది. ఏ కులాలకు, ప్రాంతాలకు అత్యవస రంగా అభివృద్ధి అవసరమో గుర్తించడానికి సీబీ ఇండెక్స్ సహాయపడుతుంది.
- వెనుకబడిన కులలాకు ప్రత్యేక నిధులు కేటాయిం చడానికి సీబీ ఇండెక్స్ కీలకంగా పని చేస్తుంది. ప్రభుత్వ స్కీమ్స్, రాయితీలను నిజంగా అవసరమై న వారికి అందించడానికి మార్గనిర్దేశం చేస్తుంది.
- ఆయా కులాలు వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలు (ఉదాహరణకు: విద్య లేకపోవడం లేదా మౌలిక సదుపాయాల కొరత) ఏమిటో అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది.
- ఏయే అంశాలలో వెనకబాటు ఉందనేది సీబీ ఇం డెక్స్‌తో కచ్చితంగా తెలియడంతో ప్రభుత్వాలు మ రింత సమర్థవంతమైన విధానాలను రూపొందిం చేందుకు అవకాశం ఉంటుంది.