- ఇంగ్లండ్ టార్గెట్ 399.. ప్రస్తుతం 67/1
- రసవత్తరంగా రెండో టెస్టు
- రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 255 ఆలౌట్
- సెంచరీతో మెరిసిన గిల్
విశాఖపట్నం:
ఇండియా, ఇంగ్లండ్ రెండో టెస్టు రసవత్తరంగా మారింది. తొలి రెండు రెండు రోజులు తేలిపోయిన ఇంగ్లండ్ మూడో రోజు పోటీలోకి రాగా.. ఆ టీమ్ బజ్‌బాల్‌కు, టీమిండియా స్పిన్‌బాల్‌కు మధ్య అసలైన సవాల్ మొదలైంది. కొన్నాళ్లుగా తడబడుతున్న శుభ్‌మన్ గిల్ (104) ఎట్టకేలకు సెంచరీతో ఫామ్‌లోకి రావడంతో ఇంగ్లండ్ ముందు టీమిండియా 399 రన్స్ టార్గెట్ ఉంచింది. ఇండియా గడ్డపై ఏ జట్టూ ఇంత పెద్ద టార్గెట్‌ను ఛేజ్ చేసింది లేదు. కానీ, ఎదురుగా ఉన్న ఇంగ్లిష్ టీమ్ కొన్నేండ్లుగా బజ్‌బాల్ గేమ్‌తో టెస్టుల్లో కొత్త ఆటను చూపెడుతోంది.
ఛేజింగ్‌లో మూడో రోజు, ఆదివారం చివరకు ఇంగ్లండ్ 14 ఓవర్లలోనే 67/1 స్కోరు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (28)ను అశ్విన్ తన తొలి ఓవర్లోనే ఔట్ చేయగా.. మరో ఓపెనర్ జాక్ క్రాలీ (29 బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన రెహాన్ అహ్మద్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌లో ఇండియా విజయానికి 9 వికెట్లు కావాలి. ఇంగ్లండ్‌కు మరో 332 రన్స్ అవసరం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 28/0తో ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 255 రన్స్‌కే ఆలౌటైంది. గిల్‌కు తోడు అక్షర్ పటేల్ (45) రాణించాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్‌లీ నాలుగు, రెహాన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టారు. దాంతో ప్రత్యర్థి ముందు రోహిత్‌సేన 400లోపే టార్గెట్‌ను ఉంచింది. రెండేండ్ల కిందట బంగ్లాదేశ్‌లో వెస్టిండీస్ 395 రన్స్‌ను ఛేజ్ చేయడమే ఆసియాలో హయ్యెస్ట్ ఛేజింగ్ విక్టరీ. పిచ్‌పై బంతి తక్కువ ఎత్తులో వస్తుండగా హైదరాబాద్ మాదిరిగా మరోసారి మ్యాజిక్ చేయాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది. ఉప్పల్ తప్పులను రిపీట్ చేయకూడదని టీమిండియా కోరుకుంటోంది.
గిల్ ఒక్కడే
తొలి టెస్టు మాదిరిగా వైజాగ్‌లోనూ టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయలేకపోయింది. శుభ్‌మన్ గిల్, అక్షర్ తప్ప మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. మూడో రోజు ఆట ఆరంభంలోనే ఆతిథ్య జట్టుకు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి 30 నిమిషాల్లో అండర్సన్ హడలెత్తించాడు. తన మొదటి ఓవర్లోనే అద్భుత డెలివరీతో కెప్టెన్ రోహిత్ (13)ను బౌల్డ్ చేశాడు.
ఆ వెంటనే ఫస్ట్ ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (17)ను కూడా పెవిలియన్ చేర్చి ఇండియాకు షాకిచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన గిల్ సైతం తొలుత తడబడ్డాడు. వరుస ఓవర్లలో రెండు రివ్యూల్లో బతికిపోయాడు. శ్రేయస్ అయ్యర్ (29)తో కలిసి కాసేపు ఓపిగ్గా ఆడిన గిల్.. బషీర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి టచ్‌లోకి వచ్చాడు. తర్వాత స్పిన్నర్లను ఎటాక్ చేస్తూ బౌండ్రీలు రాబట్టాడు. రెహాన్ బౌలింగ్‌లో 6,4తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
అయ్యర్ కూడా కొన్ని స్ట్రోక్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, హార్ట్‌లీ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ పట్టిన సూపర్ క్యాచ్‌కు అయ్యర్ వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు 81 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. కొత్త ఆటగాడు రజత్ పటీదార్ (9) నిరాశ పరచడంతో ఇండియా 130/4తో లంచ్‌కు వెళ్లింది. బ్రేక్ తర్వాత గిల్ మరింత మెరుగ్గా ఆడగా.. అతనికి అక్షర్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరూ 81 రన్స్ జోడించడంతో ఇండియా స్కోరు 200 దాటింది. స్పిన్నర్లపై దూకుడుగా ఆడిన గిల్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో ఇండియా భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, బషీర్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ట్రై చేసిన గిల్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇంగ్లండ్ రివ్యూలో బాల్ గిల్ గ్లోవ్స్‌కు తగిలినట్టు తేలడంతో అతను వెనుదిరిగాడు. ఫిఫ్టీకి చేరువైన అక్షర్ కాసేపటికే హార్ట్‌లీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో ఇండియా 227/6తో టీకి వెళ్లింది.
28 రన్స్‌కే నాలుగు వికెట్లు
చేతిలో నాలుగు వికెట్లు ఉండటంతో ఆతిథ్య జట్టు కనీసం 300 స్కోరు అయినా చేసే అవకాశం కనిపించింది. కానీ, టెయిలెండర్లు నిరాశ పరిచారు. దాంతో మరో 28 రన్స్ మాత్రమే రాబట్టిన ఇండియా 14.3 ఓవర్లలో మిగతా వికెట్లు కోల్పోయింది. లోకల్ బాయ్ శ్రీకర్ భరత్ (28 బాల్స్‌లో 6), అశ్విన్ (61 బాల్స్‌లో 29), బుమ్రా (26 బాల్స్‌లో 0) క్రీజులో నిలిచినా షాట్లు ఆడకపోవడం టీమ్‌ను దెబ్బతీసింది. భరత్, అశ్విన్ రెహాన్‌కు వికెట్లు ఇచ్చుకోగా.. హార్ట్‌లీ బౌలింగ్‌లో బుమ్రా, కుల్దీప్ (0) వెనుదిరిగారు.
