
లక్నో: ఇండియా–ఎతో మంగళవారం మొదలైన రెండో అనధికార టెస్ట్‌లో ఆస్ట్రేలియా–ఎ మెరుగైన స్కోరు సాధించింది. బౌలింగ్‌లో మానవ్ సుతార్ (5/93) కట్టడి చేసినా.. బ్యాటింగ్‌లో జాక్ ఎడ్వర్డ్స్ (88), నాథన్ మెక్‌స్వీని (74) రాణించడంతో... తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 350/9 స్కోరు చేసింది. టాడ్ మర్ఫి (29 బ్యాటింగ్), హెన్రీ థోర్న్‌టన్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 12 రన్స్ వద్ద కెల్లావే (9) వికెట్ కోల్పోయింది. అయితే, మెక్‌స్వీని కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఓపెనర్ సామ్ కాన్‌స్టస్ (49) రెండో వికెట్‌కు 86, ఒలివర్ పీక్ (29)తో మూడో వికెట్‌కు 46, జోష్ ఫిలిప్పి (39)తో ఐదో వికెట్‌కు 52 రన్స్ జత చేసి ఔటయ్యాడు. చివర్లో ఎడ్వర్డ్స్, రోచిసియోలి వికెట్ పడకుండా రోజు ముగించారు. గుర్నూర్ బ్రార్ 2, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు.
రెడ్ బాల్ క్రికెట్‌కు అయ్యర్ బ్రేక్!
ఇండియా–ఎకు కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఆట మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత టీమ్ నుంచి కూడా వైదొలిగాడు. దాంతో, జురెల్ కెప్టెన్సీ చేపట్టాడు. వెన్ను నొప్పి, అలసట కారణంగా రెడ్ బాల్ క్రికెట్ నుంచి కొంత విరామం తీసుకుంటున్నట్లు బీసీసీఐకి లేఖ రాశాడు. నాలుగు రోజుల కంటే ఎక్కువ గ్రౌండ్‌లో గడిపే చాన్స్ లేదని శ్రేయస్ భావిస్తున్నట్లు సమాచారం. టెస్టు టీమ్‌లో చాన్స్ రాకపోవడం కూడా అయ్యర్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.