IND vs AUS: సెంచరీలతో హోరెత్తించిన రాహుల్, సాయి సుదర్శన్.. ఆస్ట్రేలియా 'ఎ' పై ఇండియా 'ఎ' రికార్డ్ ఛేజింగ్

IND vs AUS: సెంచరీలతో హోరెత్తించిన రాహుల్, సాయి సుదర్శన్.. ఆస్ట్రేలియా 'ఎ' పై ఇండియా 'ఎ' రికార్డ్ ఛేజింగ్

కాన్పూర్‌ వేదికగా శుక్రవారం (సెప్టెంబర్ 26) ఆస్ట్రేలియా 'ఎ'తో ముగిసిన రెండో అనధికారిక టెస్టులో ఇండియా 'ఎ' జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కళ్ళ ముందు 412 పరుగుల భారీ లక్ష్యం కనిపిస్తున్నా కూల్ గా ఫినిష్ చేశారు. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (176) భారీ సెంచరీకి తోడు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (100) సెంచరీతో చెలరేగడంతో ఇండియా ఏ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇండియా జట్టు కేవలం 91.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేజ్ చేయడం గమనార్హం. నాలుగో రోజు మరో సెషన్ మిగిలి ఉండగానే ఇండియా ఏ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 

లిస్ట్ 'ఏ' టెస్ట్ క్రికెట్ లో ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. ఓవర్ నైట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 169 పరుగులతో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా ప్రారంభంలోనే మానవ సుతార్ వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో రాహుల్ తో కలిసి సాయి సుదర్శన్ కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. నాలుగో వికెట్ కు వీరిద్దరూ 78 పరుగులు జోడించి జట్టును ఛేజింగ్ వైపు నడిపించారు.  ఈ క్రమంలో వీరిద్దరూ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.  143 బంతుల్లో మొదట రాహుల్ తన 22వ ఫస్ట్-క్లాస్ సెంచరీని అందుకుంటే.. మరో ఎండ్ లో సుదర్శన్ 172 బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. 

సెంచరీ తర్వాత సాయి సుదర్శన్ వెంటనే ఔట్ కావడంతో ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ ధృవ్ జురెల్ తో కలిసి రాహుల్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఐదో వికెట్ కు 115 పరుగులు జోడించి జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చారు. జురెల్ ఔటైనా చివరి వరకు క్రీజ్ లో ఉన్న రాహుల్ 176 పరుగులు చేసి ఇండియాను గెలిపించాడు. అంతకముందు 3 వికెట్ల నష్టానికి 16 పరుగులతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 46.5 ఓవర్లలో 185 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇండియా ముందు 412 రన్స్‌‌‌‌‌‌‌‌ లక్ష్యాన్ని ఉంచింది.

ALSO READ : క్రికెట్‌లో అలాంటి కామెంట్స్ వద్దు..

నేథన్‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌స్వీని (85 నాటౌట్‌‌‌‌‌‌‌‌), జోస్‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ (50) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలు చేశారు. గుర్నూర్‌‌‌‌‌‌‌‌ బ్రార్‌‌‌‌‌‌‌‌, మానవ్‌‌‌‌‌‌‌‌ సుతార్‌‌‌‌‌‌‌‌ చెరో మూడు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 'ఏ' తం అథోలి ఇన్నింగ్స్ లో 420 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి సొంతగడ్డపై తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 'ఏ' కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు 226 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్‌‌‌‌‌‌‌‌ 46.5 ఓవర్లలో 185 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 412 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఏ 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.