గాలి జోరు పెరుగుతోంది : దూసుకుపోతున్న విండ్‌‌ ఎనర్జీ

గాలి జోరు పెరుగుతోంది : దూసుకుపోతున్న విండ్‌‌ ఎనర్జీ

2020 చివరకు మరో 4 గిగావాట్లకు చేరుకోనున్న విండ్​ పవర్​

న్యూఢిల్లీ : ఇండియాలో విండ్‌‌ ఎనర్జీ (గాలిమరల ద్వారా విద్యుత్‌‌ ఉత్పత్తి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు మరో 3.5 – 4 గిగావాట్లు పెరుగుతుందని రేటింగ్ ఏజన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. భూ సేకరణ, ట్రాన్స్‌‌మిషన్‌‌ కనెక్టివిటీ అంశాలలో  విండ్‌‌ ఎనర్జీ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందని,  ఆ రెండు సమస్యలూ అలాగే కొనసాగుతున్నాయని పేర్కొంది. కొన్ని పెద్ద ప్రాజెక్టులను అప్పచెప్పడంతోపాటు, కొన్ని సమస్యలనూ పరిష్కరిస్తున్న నేపథ్యంలో 2020 ఆర్థిక సంవత్సరం చివరకు విండ్‌‌ ఎనర్జీ 3.5–4 గిగావాట్లకు పెరగనుందని ఇక్రా రిపోర్టు వెల్లడిస్తోంది. ఫిబ్రవరి 2017 నుంచి ఇప్పటిదాకా మొత్తం 12 గిగావాట్లకు పైగా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ నోడల్‌‌ ఏజన్సీలు, రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్‌‌ కంపెనీలు అనుమతులు ఇచ్చాయని తెలిపింది.

దీంతో కెపాసిటీ గణనీయంగా పెరిగే అవకాశం కలిగిందని వివరించింది. ఐతే, ఈ ప్రాజెక్టుల అమలు కొంత నెమ్మదిగానే సాగుతోందని, ముఖ్యంగా భూ సేకరణ, ట్రాన్స్‌‌మిషన్‌‌ కనెక్టివిటీ సమస్యలు ఈ రంగాన్ని పట్టి వేధిస్తున్నాయని తెలిపింది. ఈ కారణాల వల్లే 2019 ఆర్థిక సంవత్సరంలో 1.6 గిగావాట్ల సామర్థ్యం మాత్రమే అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది. విండ్‌‌ ఎనర్జీ డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని, ఇన్సెంటివ్స్‌‌, భూ సేకరణ, రాష్ట్రాలలో ట్రాన్సిమిషన్‌‌ రంగంలో పెట్టుబడులు పెంచడం వంటివి ఇందులో ఉన్నాయని ఇక్రా వెల్లడించింది.

కొన్ని ప్రాజెక్టులు భూసేకరణ, నిధులు సమకూర్చుకోవడం విషయంలో ఇబ్బందులు పడుతున్నాయని ఇక్రా తెలిపింది. డెవలపర్లు సరైన సమయానికి నిధుల సమీకరించుకోవడం చాలా కీలకమని ఇక్రా వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ కార్పొరేట్‌‌ రేటింగ్స్‌‌ గిరీష్‌‌కుమార్‌‌ కదం చెప్పారు. ఇటీవల జరిగిన ఆక్షన్స్‌‌లో విండ్‌‌ ఎనర్జీ యూనిట్‌‌ ధర రూ. 3 లోపే ఉందని, సగటు బిడ్‌‌ టారిఫ్‌‌ చూస్తే, 2017 లోని రూ.3.01 నుంచి 2018 లో రూ. 2.64 కి తగ్గిపోయిందని అన్నారు. కానీ, ఈ ఏడాది ఆక్షన్స్‌‌లో ఈ సగటు టారిఫ్ కొద్దిగా పెరిగి రూ. 2.85 కి చేరిందని చెప్పారు.గతంలో ఇచ్చిన విండ్‌‌ ఎనర్జీ ప్రాజెక్టుల అమలులో సవాళ్ల వల్లే టారిఫ్‌‌ కొంత మేర పెరిగిందని ఇక్రా అభిప్రాయపడింది. ఇటీవలి బిడ్స్‌‌లో పోటీ కూడా కొంత తగ్గిందని పేర్కొంది. డెవలపర్ల నిధుల సమీకరణ సవాళ్ల వల్లా టారిఫ్‌‌ కొద్దిగా పెరిగిందని వివరించింది. ఎక్కువ విద్యుత్‌‌ ఉత్పత్తి సాధించగల లొకేషన్స్‌‌ గుర్తింపు మీదే డెవలపర్లకు ఆ టారిఫ్ గిట్టుబాటవుతుందా లేదా అనేది ఆధారపడుతుందని ఇక్రా పేర్కొంది. అంతేకాదు, దీర్ఘకాలిక రుణాలు, పెట్టుబడి వ్యయంపై కూడా టారిఫ్‌‌ గిట్టుబాటవడమనేది ఆధారపడి ఉంటుందని తెలిపింది.

రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూషన్‌‌ కంపెనీల నుంచి కలెక్షన్స్‌‌ విషయంలో విండ్‌‌ ఎనర్జీ డెవలపర్లు చిక్కులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. కొన్ని రాష్ట్రాలలో డబ్బులు వసూలు చేసుకోవడం కష్టతరంగా మారిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌‌లో డిస్కంల నుంచి రావల్సిన బకాయిలు 8–10 నెలలకు చేరిందని, మార్చి 2018 నాటికి ఈ సైకిల్‌‌ 4–5 నెలలుగా ఉండేదని ఇక్రా స్పష్టం చేసింది.  తమిళనాడులోని ఇండిపెండెంట్‌‌ పవర్‌‌ ప్రొడ్యూసర్స్‌‌ (ఐపీపీ)లకు చెల్లింపులు జాప్యమవుతున్నాయని, చెల్లింపులకు 9 నెలల దాకా పడుతోందని పేర్కొంది. దీంతో డెవలపర్ల లిక్విడిటీ దెబ్బతింటోందని వివరించింది. ఇదే సమయంలో మహారాష్ట్రలోని విండ్‌‌ ఎనర్జీ డెవలపర్లకు చెల్లింపులు మెరుగుపడ్డాయని, అంతకు ముందు 12 నెలలు పట్టేదని ఇక్రా వెల్లడించింది. ఇప్పుడు 3–4 నెలలకే డెవలపర్లకు డబ్బులు చేతికి అందుతున్నాయని తెలిపింది. చాలా వరకు పాత బకాయిలను  కూడా అక్కడి డిస్కం చెల్లించేసిందని పేర్కొంది. డిస్కంలు తమ  సామర్థ్యాన్ని పెంచుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇక్రా అసోసియేట్‌‌ హెడ్‌‌ విక్రం చెప్పారు.  డిస్కంలు స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే ఆర్థిక పనితీరు మెరుగుపడాలన్నారు. అప్పుడే విద్యుత్‌‌ ఉత్పత్తిదారులకు డిస్కంలు సకాలంలో చెల్లింపులు జరపగలుగుతాయని చెప్పారు.