- మైగ్రెంట్లను భారత్ బలవంతంగా తోసేస్తోందంటూ ఆరోపణలు
ఢాకా: భారతదేశం నుంచి బంగ్లాదేశీయుల ‘పుష్- ఇన్లు’(బలవంతపు తోసివేతలు) , సరిహద్దుల్లో కాల్పులకు నిరసనగా నేడు భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు జమాత్–-ఇ–-ఇస్లామీ, దాని అనుబంధ 11 పార్టీల కూటమి ప్రకటించింది. సరిహద్దుల్లో అక్రమ ప్రవేశాలను అడ్డుకునేందుకు స్థానిక ప్రజలు ‘మానవహారం’ ఏర్పాటు చేయాలని నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) పిలుపునిచ్చింది.
ఢిల్లీలో భారత్ (బీఎస్‌ఎఫ్), బంగ్లాదేశ్ (బీజీబీ) సరిహద్దు దళాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఈ నిరసనలకు పిలుపునివ్వడం గమనార్హం. శుక్రవారం భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో నిరసనలు, జూన్ 15న రాజధాని ఢాకాలో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు.
మూడు నెలల్లో భారత్ నుంచి దాదాపు 2,479 మంది బంగ్లాదేశీయులను బలవంతంగా నెట్టివేసే ప్రయత్నాలు జరిగాయని, వైరోవైపు బీఎస్‌ఎఫ్ కాల్పుల్లో 19 మంది మృతి చెందారని జమాత్ కూటమి ఆరోపించింది. కాగా, జమాత్ కూటమి ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.
ఎలాంటి 'పుష్-ఇన్లు' చేయడం లేదని, కేవలం చట్టవిరుద్ధ వలసదారులను చట్టపరమైన ప్రక్రియ, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారమే తగిన ధృవీకరణ తర్వాత స్వదేశానికి పంపుతున్నామని స్పష్టం చేసింది.
