వాషింగ్టన్: భారత్ నుంచి పశ్చిమాసియా మీదుగా యూరప్ వరకూ ప్రతిపాదించిన ‘ఇండియా– మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనమిక్ కారిడార్ (ఐమెక్)కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు. హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఇరాన్ అడ్డంకిగా మారిన నేపథ్యంలో ఈ సమస్యకు ఇదే చక్కని పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరాన్ చెక్‌పాయింట్‌ల నుంచి దూరంగా ఇంధన రవాణా చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వాణిజ్య నౌకలపై ఇరాన్ ఉగ్రవాద దాడులు పశ్చిమాసియా ఇంధన వనరులను ఇరాన్ చెక్‌పాయింట్‌ల నుంచి దూరంగా మార్చాల్సిన అవసరాన్ని చూపించాయి.
అందుకే ఐమెక్‌ను నేను గట్టిగా సమర్థిస్తున్నా. అలాగే పైప్‌లైన్ లేదా ఏదైనా ఇతర మార్గం ద్వారా చమురును బయటకు తరలించడంపై ఫోకస్ పెట్టాలి”అని ఆయన సూచించారు. కాగా, భారత్-–పశ్చిమాసియా-–యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది భారత్ సహా వివిధ దేశాలు ప్రతిపాదించిన మల్టీ-మోడల్ కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు. దీనిని2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జీ20 సమిట్‌లో అధికారికంగా ఆవిష్కరించారు.
రైలు, షిప్పింగ్, ఇంధన, డిజిటల్ లింక్‌ల కోసం ప్రణాళికలను రూపొందిస్తూ భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాలు ఒక మెమొరాండంపై సంతకం చేశాయి.
ప్రతిపాదిత కారిడార్‌లో భారత్‌ను గల్ఫ్‌తో అనుసంధానించే తూర్పు మార్గం, గల్ఫ్‌ను యూరప్‌తో అనుసంధానించే ఉత్తర మార్గం ఉన్నాయి. ఈ ఏర్పాటులో ఇప్పటికే ఉన్న సముద్ర, రోడ్డు రవాణా మార్గాలను కలుపుతూ తక్కువ ఖర్చుతో కూడిన క్రాస్ -బార్డర్ షిప్- టు -రైల్ ట్రాన్సిట్ నెట్‌వర్క్‌గా పనిచేసే రైల్వే మార్గం ఉంటుంది.
క్లీన్ హైడ్రోజన్ ఎగుమతి కోసం పైపుతో పాటు, ఇంధన, డిజిటల్ కనెక్టివిటీ కోసం కేబుల్‌ను వేయాలని కూడా ఇందులో ప్రతిపాదించారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కు కూడా ఇది వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా మారనుంది.
