గీతిక శ్రీవాస్తవ ఎవరు?.. పాక్లో తొలి భారత డిప్యూటీ హై కమిషనర్గా నియామకం

 గీతిక శ్రీవాస్తవ ఎవరు?..  పాక్లో తొలి భారత డిప్యూటీ హై కమిషనర్గా నియామకం

పాకిస్థాన్‌ లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ హై కమిషనర్‌గా విదేశాంగశాఖ సీనియర్‌ అధికారి గీతికా శ్రీవాస్తవను కేంద్రం నియమించింది. పాక్ లో ఈ సేవలు చేపట్టనున్న మొదటి భారత మహిళ ఈమె కావడం విశేషం. ప్రస్తుతం అక్కడ విధుల్లో ఉన్న  డాక్టర్ సురేష్ కుమార్ పదవీకాలం పూరైన వెంటనే ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.   

2019 ఆగస్టు 5 తేదీన భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన వెంటనే రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతర పరిణామాలతో అప్పటి భారత హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా భారత్‌కు వచ్చేశారు. అప్పటినుంచి రెండు దేశాల్లోనూ పూర్తిస్థాయి హైకమిషనర్లు లేరు. హైకమిషనర్‌ లేనిపక్షంలో డిప్యూటీ హైకమిషనర్లే మిషన్‌కు బాధ్యత వహిస్తారు. 

గీతిక శ్రీవాస్తవ ఎవరు?

ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీవాస్తవ, 2005 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి, దౌత్యరంగంలో దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఆమె ఇంతకుముందు కోల్‌కతాలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని IOR విభాగంలో డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా శ్రీవాస్తవ చైనాలోని భారత హైకమిషన్‌లో అనేక అసైన్‌మెంట్‌లను కూడా నిర్వహించారు.  ప్రస్తుతం, ఆమె ఇండో-పసిఫిక్ విభాగానికి ఇన్‌ఛార్జ్ జాయింట్ సెక్రటరీగా న్యూఢిల్లీలోని MEAలో పని చేస్తున్నారు.

ఇదిలా ఉండగా భారత్‌కు పాకిస్థాన్‌కు కొత్త ఛార్జ్ డి'అఫైర్స్‌గా సాద్ వార్రైచ్‌ను పాక్ ప్రభుత్వం నియమించింది. ఐజాజ్ ఖాన్ స్థానంలో సాద్ వారియచ్ నియమితులయ్యారు.