- యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయని వెల్లడి
- బేగంపేట ఎయిర్‌పోర్టులో ‘వింగ్స్ ఇండియా’ ఎగ్జిబిషన్ ప్రారంభం
- రేపు, ఎల్లుండి ప్రజలకు అనుమతి
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచ స్థాయి ఏవియేషన్ హబ్‌గా భారత్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో ‘వింగ్స్ ఇండియా 2026’ ఎగ్జిబిషన్‌ను రామ్మోహన్ నాయుడు బుధవారం (జనవరి 28) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వచ్చే పదేండ్లలో దేశీయ తయారీ వ్యవస్థను బలోపేతం చేసి, ఎయిర్‌క్రాఫ్ట్ డిమాండ్‌ను తీరుస్తాం. 10–12 ఏండ్లలో భారత్ సివిల్ ఏవియేషన్ ఉత్పత్తుల గ్లోబల్ ఎక్స్‌పోర్టర్‌గా మారుతుంది. ఈ రంగంలో యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయి” అని తెలిపారు. ‘‘విమానయాన రంగంలో వివిధ దేశాలు, సంస్థలతో సంబంధాలను పెంచుకోవాలని చూస్తున్నాం. ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ భారత విమానయాన రంగం భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం వివిధ విమానాల స్టాటిక్ డిస్‌ప్లేను మంత్రి సందర్శించారు. ఎయిర్ ఇండియా లైన్-ఫిట్ బోయింగ్ 787–-9 డ్రీమ్‌లైనర్, ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737–-8, రష్యాకు చెందిన ఇల్యూషిన్ ఐఎల్ 114-300 విమానాలను పరిశీలించారు. ఈ ఈవెంట్‌కు 20కి పైగా దేశాల ప్రతినిధులు, ఇండస్ట్రీ లీడర్లు, ఇన్నోవేటర్లు, స్టేక్‌హోల్డర్లు తరలివచ్చారు. దాదాపు 3 వేల మంది బిజినెస్విజిటర్లు పాల్గొంటున్నారు. కాగా, నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో మొదటి రెండు రోజులు విదేశీ ప్రతినిధులు, ఇండస్ట్రీ స్టేక్‌హోల్డర్ల చర్చల కోసం కేటాయించారు. మిగిలిన రెండు రోజులు (ఈ నెల 30, 31) సాధారణ ప్రజలను అనుమతిస్తారు. కాగా, బుధవారం సాయంత్రం
నిర్వహించిన ఎయిర్ షో ఆకట్టుకుంది.
ప్రత్యేక ఆకర్షణగా రష్యా ఫ్లైట్లు..
రష్యా నుంచి వచ్చిన సూపర్‌జెట్ (ఎస్‌జే -100), ఈఎల్-114-300 స్టాటిక్ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. మాస్కో సమీపంలోని ఝుకోవిస్కీ నుంచి హైదరాబాద్ వరకు ఈ రెండు విమానాలు 10కి పైగా దేశాల గగనతలంలో ప్రయాణించాయని.. విభిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో తమ దేశీయ వ్యవస్థలు సాధారణంగా పని చేశాయని రష్యన్ అధికారులు తెలిపారు. ఈఎల్-114-300 ఫ్లైట్‌ను టెస్ట్ పైలెట్లు సెర్గే సుఖార్, అంటోన్ సినిట్సిన్, సెర్గే పెట్రెంకోలతో పాటు ఫ్లైట్ ఇంజినీర్ పావెల్ నడిపించారు. సూపర్‌జెట్‌ను టెస్ట్ పైలెట్లు లియోనిడ్ చికునోవ్, ఇగోర్ గ్రెవ్‌త్సెవ్, అలెగ్జాండర్ వెర్ఖోవ్‌లతో కలిసి లీడ్ టెస్ట్ ఇంజినీర్ అలెగ్జాండర్ క్రిలోవ్ నడిపారు. భారత్-రష్యా స్నేహ సంబంధాలకు మరింత బలం చేకూర్చేలా ఈ ప్రదర్శన జరుగుతున్నదని, ప్రాంతీయ విమానయాన రంగంలో సహకార అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
