న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) రద్దు, ఎస్ఐఆర్ అంశాలను లేవనెత్తాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, కేంద్ర బడ్జెట్ పై జరిగే చర్చల్లో పాల్గొంటూ ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలపాలని డిసైడ్ అయ్యాయి. బుధవారం పార్లమెంట్ లో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్లో ఇండియా బ్లాక్‌కు చెందిన విపక్ష పార్టీల ఎంపీలు సమావేశమయ్యారు.
ఈ మీటింగ్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్, ఎస్పీ ఎంపీ జావేద్ అలీ ఖాన్, ఆర్జేడీ ఎంపీ ప్రేమ్ చంద్ గుప్తా, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐ ఎంపీ పి. సంతోష్, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్ కె ప్రేమ్ చంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా, కేంద్ర బడ్జెట్ సమర్పణ, చర్చ సమయంలో కూడా నాయకులు నిరసన తెలిపాలని నిర్ణయించారు. అనంతరం జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ పునరుద్ధరణను డిమాండ్ చేయడానికి ప్రతిపక్షం అన్ని ప్రజాస్వామ్య మార్గాలను ఉపయోగిస్తుందని వెల్లడించారు.
