రష్యా నుంచి భారీగా చమురు..ఈ దేశ ఎగుమతుల్లో 36 శాతం వాటా మనకే

రష్యా నుంచి భారీగా చమురు..ఈ దేశ ఎగుమతుల్లో 36 శాతం వాటా మనకే

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ, రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును ఇండియా దిగుమతి చేసుకుంటోంది.  ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. ఈ ఏడాది మే నెలలో భారత్ దాదాపు 5.8 బిలియన్ యూరోల (దాదాపు రూ. 63,800  కోట్ల) విలువైన రష్యన్ ఇంధనాలను దిగుమతి చేసుకుందని యూరోపియన్ థింక్ ట్యాంక్ సీఆర్‌‌‌‌ఈఏ రిపోర్ట్  వెల్లడించింది. దీని ప్రకారం, రష్యా నుంచి ఇండియాకు అయిన  మొత్తం దిగుమతుల్లో ముడి చమురు వాటా 83శాతం (4.8 బిలియన్ యూరోలు) గా ఉంది. మిగిలినవి బొగ్గు, ఇతర చమురు ఉత్పత్తులు ఉన్నాయి. 

ఏప్రిల్‌‌తో పోలిస్తే మే నెలలో రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు 21శాతం పెరిగాయి.  గుజరాత్‌‌లోని వాడినార్ రిఫైనరీకు సప్లయ్‌ 36శాతం, జామ్‌‌నగర్ రిఫైనరీకి 14శాతం పెరిగాయి. గతంలో నిలిపివేసిన ప్రభుత్వ రంగ రిఫైనరీలు (విశాఖపట్నం 42శాతం, న్యూ మంగళూరు 13శాతం) కూడా మళ్లీ రష్యా చమురు కొనుగోళ్లను భారీగా పెంచాయి. ఒడిశాలోని పారాదీప్ రిఫైనరీ గత రెండేళ్లలో అత్యధికంగా రష్యన్ క్రూడ్‌‌ను అన్‌‌లోడ్ చేసింది.  

రష్యా ముడి చమురు ఎగుమతుల్లో చైనా అత్యధికంగా 50శాతం కొనుగోలు చేయగా, భారత్ 36శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో టర్కీ (6శాతం), ఈయూ (5శాతం) ఉన్నాయి. రష్యన్ ముడి చమురును ఉపయోగించి తయారు చేసిన ఉత్పత్తులపై ఈయూ  నిషేధం విధించినప్పటికీ.. భారత్, టర్కీ వంటి దేశాల నుంచి మే నెలలో దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన చమురు ఉత్పత్తులు ఈయూ, అమెరికా, ఆస్ట్రేలియాకు ఎగుమతి అయ్యాయి.